ఎస్వీబీసీ.. పవన్, బాలయ్య అనుగ్రహం ఎవరికో?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారికి సేవ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే అక్కడ అటెండర్ ఉద్యోగం మొదలుకుని ఛైర్మన్ వరకూ ఉన్న ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన చుట్టుపక్కలున్న రాష్ట్రాల నుంచి కూడా గట్టిగానే పోటీ ఉంటుంది. అందుకే టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా ఇంకొన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖులను నియమిస్తూ రావడం ఆనవాయితీగానే మారింది. టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత ఛైర్మన్‌గా బీఆర్ నాయుడుని నియమించిన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఇప్పుడిక ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఛైర్మన్ పదవి రాకపోవడంతో ఎలాగైనా సరే ఈ పదవి తమకే దక్కాలని జనసేన, బీజేపీ నేతలు పోటాపోటీగా ఉన్నారు. సింహభాగం సీట్లు టీడీపీకే గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేలా లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ పదవి కోసం సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా గట్టిగానే మంతనాలు నడుపుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది. అనుగ్రహం ఎవరికి ఉంటుందో అని సినీ ప్రముఖులు ఎదురుచూపుల్లో ఉన్నారు.
ఎవరెవరు..?
తిరుమలలో కీలక పదవుల్లో పనిచేసే అవకాశం కొన్నేళ్లుగా సినీ ప్రముఖులు వస్తూనే ఉంది. గతంలో కె. రాఘవేంద్రరావు, థర్టీ ఇయర్స్ పృథ్వీ పనిచేశారు. ఇప్పుడు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోసం అశ్వనీదత్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో కొందరు నేరుగా సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో టచ్‌లో ఉండగా, మరికొందరు బాలయ్య, ఇంకొందరు పవన్ కళ్యాణ్‌తో టచ్‌లో ఉన్నారు. ఎలాగైనా సరే తమకు ఇప్పించండి సార్ అని బాలయ్య, పవన్ అనుగ్రహం కోసం పట్టుబడుతున్నారని తెలిసింది. వాస్తవానికి అశ్వనీదత్‌కు నేరుగా చంద్రబాబు, లోకేశ్‌లతో కలుస్తారు. కాబట్టి అక్కడే డీల్ చేస్తున్నారట. ఇక రాఘవేంద్రరావు సైతం రెండోసారి అవకాశం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కూడా నేరుగానే చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. ఇక మురళీమోహన్ గురించి అయితే అస్సలే చెప్పక్కర్లేదు. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం మూడు దఫాలుగా భగీరథ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఈసారి పక్కా అనుకున్నప్పటికీ వర్కవుట్ కాలేదు. కనీసం ఎస్వీబీసీ అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారట.
పవన్, బాలయ్య మనసులో ఏముంది?
బోయపాటి శ్రీను నందమూరి ఫ్యామిలీకి బాగా దగ్గరగా, బాలయ్యకు అత్యంత సన్నిహితుడు కూడా. కాబట్టి ఈయన ద్వారా రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్‌కు ఇప్పిస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఎందుకంటే పార్టీ పెట్టినప్పట్నుంచీ జనసేనకు ఎన్నోవిధాలుగా సేవలు చేశారు. దీనికి తోడు పవన్‌కు బాగా కావాల్సిన వ్యక్తి. అత్యంత ఆప్తుడు కూడా. ఇప్పటికే ఆనందసాయికి టీటీడీ బోర్డులో అవకాశం ఇప్పించి, నమ్మినబంటుకు న్యాయం చేసిన పవన్.. ఇప్పుడిక త్రివిక్రమ్‌ను కూడా సెట్ రైట్ చేయాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ రెండోవారంలో నియామకం ఉండొచ్చని తెలుస్తోంది. ఎస్వీబీసీ ఛైర్మన్‌తో పాటు వెంకటేశ్వర ఎంప్లాయిస్ అకాడమీ ఛైర్మన్ పదవి కూడా కీలకమైనదే. ఈ రెండింటిలోనూ ఒకటి జనసేన, ఇంకొకటి టీడీపీ పంచుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. పార్టీలు వేరైనా ఈ రెండూ కూడా సినీ ప్రముఖులకే దక్కే ఛాన్స్ ఉంది. వెంకన్న సన్నిధిలో సేవ చేసే సినీ ప్రముఖులు ఎవరో, ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో చూడాలి మరి.