అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ అహర్నిశలు శ్రమించిన అన్నయ్య కొణిదెల నాగబాబుకు ఉన్నతస్థాయిలో చూడాలని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ఆశగా ఉన్నారు. అంతేరీతిలో పార్టీ కోసం కష్టపడిన తనకు కచ్చితంగా కీలక పదవి బాధ్యతలు కట్టబెడతారని ఎదురుచూపుల్లో ఉన్నారు. ఐతే అటు పవన్, ఇటు నాగబాబు నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. పెద్దలసభ రాజ్యసభకు నాగబాబును పంపడానికి లైన్ క్లియర్ చేసేశారు పవన్.
గట్టిగానే ప్రయత్నాలు..
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో చర్చించిన అంశాల్లో రాజ్యసభ సీటు విషయం కూడా ఒకటి. ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇవ్వాలని ఇటు సీఎం చంద్రబాబు, అటు కేంద్రంలోని బీజేపీ పెద్దల దగ్గర గట్టిగానే ప్రయత్నాలు చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సేనాని హస్తినకు వెళ్లారని తెలియవచ్చింది. పవన్ మాటకు పెద్దలు కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. ఇప్పట్లో ఛాన్స్ మిస్ అయితే మాత్రం తర్వాత కష్టమే అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అధినేత భావిస్తున్నారు.
అప్పట్లోనే అన్నకు మాట..
వాస్తవానికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నాగబాబు ఎంతో ఆశపడ్డారు. ముఖ్యంగా నరసాపురం, అనకాపల్లి ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. కానీ ఈ రెండు స్థానాలు బీజేపీకి వెళ్లాయి. దీంతో ఢిల్లీలో కూర్చోబెడతానని అప్పట్లోనే అన్నకు పవన్ మాటిచ్చారు. ఇప్పుడు రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండటం, జనసేనకు కూడా అసెంబ్లీలో బలం ఉండటంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా ఒకే అయ్యింది. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు కాస్త పెద్దలసభలోకి అడుగు పెట్టడం నల్లేరుపై నడకే అయ్యింది. మొత్తానికి చూస్తే తమ్ముడు ఆంధ్రాలో.. అన్న ఢిల్లీలో రాజకీయంగా చక్రం తిప్పబోతున్నారని కార్యకర్తలు, అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.