టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్సెస్ ఏపీ పోలీసు మధ్య రోజురోజుకు వైరం పెరిగిపోతోంది. విచారణకు రాకపోవడంతో పోలీసులు వేట సాగించడం.. చిక్కడు దొరకడు అంటూ అడ్రెస్స్ లేకుండా ఆర్జీవీ ఉండటం ఇదే సరిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కనబడుట లేదు అని పోస్టర్లు అంటించడం ఒక్కటే తక్కువ. అంతలా ఆంధ్రా పోలీసులు ఆర్జీవీ ఆచూకీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇదిగో అక్కడ.. అదిగో అక్కడ.. ఇవాళ అరెస్ట్.. రేపు పక్కగా పట్టుకుంటాం ఇలానే మూడు రోజులుగా నడిచిపోతోంది. ఇక నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అనుకున్నారేమో కానీ నేరుగా ఒక వీడియోను మీడియాకు వదిలారు.
భయపడను..
ఈ వీడియోలో ఏపీ పోలీసుల గాలింపుపై నిశితంగా సమాధానం ఇచ్చారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు. అంతకు మించి వణికిపోవడం లేదు. సంవత్సరం క్రితం ఏవో ట్వీట్స్ పెట్టానని హడావుడి చేస్తున్నారు. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట. నాకు ఇచ్చిన నోటీసుపై ఎప్పుడో సమాధానం కూడా ఇచ్చేశాను. నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు. నేను ఇప్పుడు ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నాను అని వివరణ ఇచ్చుకున్నారు.
తగ్గేదెలే..
వర్మ జిమ్మిక్కులపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మెట్టు కూడా దిగకూడదని పోలీసులు భావిస్తున్నారు. విచారణకు రాకపోవడం, కనీసం ఆచూకీ కూడా లభించని నేపథ్యంలో కచ్చితంగా లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు. ఆర్జీవీ అంటేనే గ్యాంగ్ స్టర్లు దగ్గర నుంచి లోకల్ రౌడీల వరకూ అందరి జీవితాల్ని చూసి సినిమాలు తీసేసిన వ్యక్తి. ఇప్పుడు ఏకంగా రియల్ లైఫులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. ఈ ఎపిసోడ్ ఎప్పుడు పూర్తి అవుతుందో ఏంటో చూడాలి మరి.