బిలియనీర్ గౌతం అదానీ అమెరికా కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరుక్కుపోయారనే వార్త గత 24 గంటలుగా తెగ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చింది. కరెంటు తక్కువ ధరకు కొంటే అవినీతా? ఎక్కువ ధరకు కొంటే అవినీతా? అంటూ వైసీపీ ప్రశ్నించింది. కరెంటు యూనిట్ రూ.2.49కే వైసీపీ ఒప్పందం చేస్తే.. చంద్రబాబు మాత్రం రూ.6.99కి గరిష్టంగా కొంటూ ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో అవినీతి ఎవరిది? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక దేనితో ఏ అగ్రిమెంట్ లేని చోట అవినీతి ఆరోపణ కట్టుకథ కాదా? అని వివరణ ఇచ్చుకున్నది. కరెంట్ ఛార్జీలతో పాతికేళ్లు ఏపీ ప్రజల నడ్డివిరిచేందుకు ఐదేళ్ల క్రితమే శాడిస్ట్ చంద్రబాబు కుట్రకు తెరలేపారని చెప్పుకొచ్చింది.
వ్యక్తిగత హననమే..
మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండపడ్డారు. జగన్‌ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని విమర్శలు గుప్పించరు. జగన్‌పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్‌ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలైందన్నారు.
ఈనాడుపై..!
జగన్‌కు రూ.1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతా? పైగా ఇంటర్నేషనల్‌గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా? అదానీ చంద్రబాబును కలిస్తే ఆహాఓహో అంటూ ఈనాడు రాసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటూ పేజీల నిండా రాసింది. అదే అదానీ.. జగన్‌ను కలిస్తే పోర్టులు, మైనింగ్ అంతా అదానీకే దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాసింది. ఇలా రాస్తే జనం నవ్వుతారని కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలు రాసిందని అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేం తప్పేం చేయలేదు!
కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముంది?రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా? అదే రూ.2.49లకే జగన్ కొనుగోలు చేస్తే అవినీతా? అడ్డగోలు ఒప్పందాలతో చంద్రబాబు జనం మీద భారం వేస్తే అది ఈనాడుకు కనపడదా? జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని నాని మీడియా వెల్లడించారు.
మాకేం అవసరం?
కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరం. జగన్ కంటే సంవత్సరమన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల అధిక ధరలతో కొనుగోలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు జరిగితే చంద్రబాబు ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేశారు?. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలి. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చింది. అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుంది? అని పేర్ని నాని ప్రశ్నించారు.