బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. నిధుల సేకరణకు లంచం ఇచ్చారని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలు చేసింది. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం మొత్తం
265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ లేఖను రిలీజ్ చేసింది. అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు 8 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో న్యూయార్క్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ దెబ్బతో అదానీ ఆస్తులన్నీ భారత స్టాక్‌మార్కెట్లలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. గత ఏడాది హిండెన్ బర్గ్ నివేదికలతో భారీగా పతనమైన అదానీ ఆస్తులు.. ఆ తర్వాత అంత స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ ఈ ముడుపుల వ్యవహారంలో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు భారీగానే ముడుపులు ముట్టాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింహభాగం అందాయి.
నిండా మునిగినట్టేనా?
ఈ లంచాల వ్యవహారంలో భారతదేశం మొత్తం మీద రూ. 2028 కోట్ల లంచాలు మాట్లాడుకుంటే, అందులో రూ. 1750 కోట్లు ఒక్క ఏపీ నాయకుడికే ఇచ్చారని అమెరికా సంస్థలు ఆధారాలతో సహా తేల్చాయి. ఎందుకంటే మరే రాష్ట్రం కూడా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాగా అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి 8 గిగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకోలేదు. సెకీ సంస్థతో విద్యుత్ ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా జగన్ సర్కారు పేరు రావడంతో జగన్ నిండా మునిగినట్టే అని తప్పక శిక్ష పడుతుందనీ న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి.
జగన్ పక్కానా..?
వాస్తవానికి వైసీపీ హయాంలో చిన్న చిన్న ప్రాజెక్టులు మొదలుకుని భారీ అంతకు మించి అన్నీ అదానీకే వైఎస్ జగన్ కట్టబెట్టారన్న విషయం జగమెరిగిన సత్యమే. ముఖ్యంగా పోర్టులు, ప్రాజెక్టులు, సోలార్ పవర్ కూడా రాసిచ్చేసిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ జమానాలో అదానీదే రాజ్యం అని చెప్పుకోవచ్చు. సీన్ కట్ చేస్తే సరిగ్గా మూడేళ్లు కూడా ముగియక ముందే ఈ ఇద్దరి అక్రమ బంధాన్ని అమెరికా సంస్థలే బట్టబయలు చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే అమెరికా దర్యాప్తు సంస్థలు ఎంతసేపూ ఏపీలో 2019- 2024 వరకు ఉన్న హయ్యర్ అఫిషియల్ అంటూ పదే పదే పేర్కొనడం గమనార్హం. దీంతో ఆ హయ్యర్ అఫిషియల్ ఇంకెవరు వైఎస్ జగన్ రెడ్డే అని అంతా చర్చించుకుంటున్నారు. ఐతే.. అప్పట్లో సీఎంను కాదని అధికారిగా ఉండే ఎవరైనా ఉన్నారా..? పోనీ అంత సాహసం చేస్తారా..? అంటే అది అయ్యే పని కానే కాదని విశ్లేషకులు చెబుతున్న మాట.
మోదీ సంగతేంటి?
వాస్తవానికి మోదీ పాలించిన పదేళ్లు, ఇప్పుడు కూడా అంబానీ, అదానీలను పెంచి పోషించి.. పెద్దలను చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికిప్పుడు పుట్టినవేం కాదు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ నడుస్తున్నవే. దీనికి తోడు ఈ ఇద్దరూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం, ఇలా పదుల సంఖ్యలో కారణాలు చెబుతూ ఇండియాను రాసిస్తున్నారని పెద్ద పెద్ద ఆరోపణలే కాంగ్రెస్ చేస్తూ వస్తోంది. అమెరికాకు వెళ్లి అక్కడి కొన్ని కంపెనీల భాగస్వామ్యంతో నిధులు సేకరించి.. ఆ డబ్బులను ఇండియాలో పెట్టీ, ఎవరూ సహసించరని లంచం రూపంలో ఇచ్చారన్నది ఇప్పుడు అదానీ మీద ఉన్న పెద్ద ఆరోపణ. ఇవన్నీ దేశ ప్రధానికి, అందులోనూ దోస్తానా ఉన్న మోదీకి తెలియకుండా జరిగి ఉంటాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ ఇలా ఎన్ని కేసులు, ఇవీ కాదు ఇండియాలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఎన్డీయే సర్కార్ సాహసం చేస్తుందా అనేది సమాధానం లేని ప్రశ్న.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పుడేం చేస్తారు?
అదానీ కుంభకోణంతో చంద్రబాబు అమరావతి ఆశల గల్లంతు? అంటూ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే అమరావతి గ్రామాల్లో అనేక ప్రాజెక్టులు అదానీ చేపట్టనున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. దీనికి తోడు రాష్ట్రంలో భారీగా ప్రాజెక్టులు సైతం కట్టబెట్టిన పరిస్థితులు మనం చూశాం. ఇప్పుడు అవన్నీ బాబు రద్దు చేసుకుంటారా? పైన మోదీ ఉన్నారు గనుక ఆయనే అన్నీ చూసుకుంటారు అని సైలెంట్ అవుతారా..? అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం. ఇప్పటికే ఆదానీతో ఇప్పటి వరకూ టీడీపీ కూటమి చేసుకున్న ఒప్పందాలు అన్నీ రద్దు చేసుకోవాలని డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భారీ పెట్టుబడులకు ఆహ్వానించడంతో అదానీ గ్రూప్స్ సిద్దమవ్వడం, ఫండ్స్ కూడా ఇవ్వన్నీ జరిగాయి. ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు.. మోదీ - అదానీ బంధాన్ని తప్పుబట్టినా, తిట్టి పోసినా సరే రేవంత్ మాత్రం అబ్బే అంటూ అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అదానీ పైన వచ్చిన ఆరోపణలతో ఎలా స్పందిస్తారు. పోనీ ఆయన ఫండ్స్ రూపంలో ఇచ్చిన కోట్లాది రూపాయలు వెనక్కి ఇస్తారా..? ఇప్పుడు ఆంధ్రాలోని గురువు బాబు.. శిష్యుడు రేవంత్ ఏం చేయబోతున్నారో చూడాలి మరి.
అంతా తూచ్..!
అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తమ సంస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఖండిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థ పూర్తి పారదర్శకతతో నిబంధనలు పాటిస్తుందనీ, వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళనచెందొద్దనీ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడా తాము అవినీతికి పాల్పడలేదని, చట్టాలకు కట్టుబడి ఉంటామనీ అదానీ గ్రూప్ తెలిపింది. ఐతే.. అమెరికా ప్రభుత్వం స్పందించి.. నిజమని తేలితే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఐతే.. అమెరికాలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పటి వరకూ మోదీ సర్కార్ మాత్రం స్పందించలేదు. మరి ఈ మొత్తం వ్యవహారంలో అదానీ ఎలా బయటపడతారు..? ఆయనతో పాటు ఏపీకి చెందిన ఆ హయ్యర్ అఫిషియల్ ఎలా సేఫ్ అవుతారు? అనేది చూడాలి. ఐనా ఇలాంటివన్నీ బిలియనీర్లకు కొత్తేమీ కాదుగా..!