పదేళ్లు బాబు సరే.. మన సంగతేంటి పవన్?
మిత్రపక్షంలో ఉన్న ఎవ్వరైనా సరే, ఏ చిన్నపాటి అవకాశం దొరికినా సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తుంటారు. అవసరమైతే మిత్రుడిని బలవంతం చేసో, రిక్వెస్ట్ చేసో పెద్ద పొజీషన్‌లోకి వెళ్లాలని చూస్తాడు. అదీ కుదరని పక్షంలో సాఫీగా తెరవెనుక నుంచి అయినా తన పనులు చక్కబెట్టుకుంటారు. ఇవన్నీ కాదు, కచ్చితంగా పీఠం కావాల్సిందే అనుకుంటే రాజకీయ పరంగా అయితే మిత్రుడికి శత్రువుగా మారైనా సరే అనుకున్నది సాధించుకుంటాడు. ఇలాంటివి రాజకీయాల్లో సర్వసాధారణమే. ఇందుకు చక్కటి ఉదాహరణే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే సీనియర్ ఎన్టీఆర్ హయాంలో, నాదెండ్ల భాస్కరరావు హయాంలో జరిగాయి కూడా. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటా చాలా పెద్ద జాబితానే ఉంది. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉండటంతో సీఎంగా చంద్రబాబు, ఆ తర్వాతి స్థానంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారు.
ఐదు కాదు, పదేళ్లు..
బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబుకు ఇదే అసెంబ్లీ వేదికగా మాటిచ్చారు కూడా. సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నా. మేం చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలి.
చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం. సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు జలజీవన్ మిషన్‌పై కూడా డిప్యూటీ సీఎం మాట్లాడారు. దీనికి కమిటెడ్ లీడర్‌షిప్ కావాలన్నారు. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఉన్నారని, కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారని చెప్పుకొచ్చారు. మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తయిపోవాలన్నారు. ఈలోపు ప్రతీ ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందాలని, అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే కన్నీళ్లువచ్చాయని ఒకింత ఆవేదనకు లోనయ్యారు.
అన్నీ సరే గానీ..
చంద్రబాబుకు విజన్ ఉందీ, ఫార్టీ ఇయర్స్ అనుభవం కూడా ఉంది అనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని, మనసులో మాటను బయటపెట్టడంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ, తమరు సీఎం అయ్యేదెప్పుడు? మీరు ఆ పీఠంపై కూర్చుంటే చూడాలని అభిమానులు, కార్యకర్తలు, నేతలకు ఆశ ఉండదా? అని కార్యకర్తలు నిట్టూరుస్తున్న పరిస్థితి. 2014 నుంచి 2019 వరకూ టీడీపీతోనే ఉన్నారు.. పైగా ఎలాంటి పదవీ లేదు. ఇప్పుడు 2024 నుంచి 2029 వరకూ డిప్యూటీ సీఎంగానే మిగిలిపోతారా ఏంటి? పోనీ, రేపొద్దున్న చంద్రబాబు స్థానంలో ఆయన కుమారుడు, యువనేత నారా లోకేష్ వస్తే ఏం చేస్తారు? అప్పుడు కూడా ఇలానే కంటిన్యూ అవుతారా? అనేది అభిమానుల నుంచి వస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే సనాతన ధర్మం, బీజేపీ రాగం ఎత్తుకున్న పవన్ కల్యాణ్, రానున్న ఎన్నికల్లో టీడీపీతో ఉంటారనే నమ్మకం ఉందా? అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కుగానే ఉండిపోయింది. ఏదేమైనా పవన్ స్టేట్మెంట్‌తో ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో నిట్టూరుస్తూ పోస్టులు చేస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ కార్యకర్తలు అయితే.. చిత్ర, విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.