టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఇటీవల ఒంగోలు సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే మంగళవారం విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ రాలేదు. ఈ క్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా సీఐకి ఆర్జీవీ రిక్వెస్ట్ చేశారు. తాను ఇప్పట్లో విచారణకు రాలేనని, ముందస్తు సినిమా షెడ్యూల్ ఉందని వివరణ ఇచ్చుకున్నారు. తనకు మరో నాలుగు రోజులు గడవు ఇవ్వండని శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ చేశారు.
వారం కావాలి..!
మరోవైపు ఆర్జీవీ లాయర్ ఎన్ శ్రీనివాస్ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కూడా వివరణ ఇచ్చుకున్నారు. మూవీ షూటింగ్ ఉండటంతో ఆర్జీవీ బిజీగా ఉన్నారని, వారం గడవు కావాలని పోలీసులను ఆయన కోరారు. అటు వర్మ నాలుగు రోజులు అడిగితే.. ఆయన తరఫు లాయర్ మాత్రం వారం రోజుల గడువు కోరుతున్నారు. ఈ ఇద్దరి రిక్వెస్ట్ పై పోలీసులు ఇంతవరకూ స్పందించలేదు. వారి నుంచి వచ్చే రిప్లైను బట్టి, తదుపరి విచారణ తేదీని ప్రకటిస్తే వర్మ ఈసారి తప్పక వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు కేసు?
ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది చాలా వివాదాస్పదం అయ్యింది. ఐతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఒక్కొక్కరి తాట తీస్తోంది. ఇప్పటికే 1500 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 100 మందికి పైగానే సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వైసీపీకి వత్తాసు పలుకుతూ సినిమాలు, సోషల్ మీడియాలో విర్రివీగారని ఆర్జీవీపై కూడా ఫిర్యాదుల పర్వం సాగుతోంది. ఐదు రోజుల క్రితం టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీఐ కార్యాలయానికి వచ్చి ఇవాళ వివరణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు, ఎందుకు రావట్లేదు అనే దానిపై సీఐకు వివరణ ఇచ్చారు.