ఇక కొడాలి నాని వంతు.. డబిడి దిబిడే!
వైసీపీ హయాంలో విర్రవీగి, ఇష్టానుసారం మాట్లాడిన నేతలు.. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన ఏ ఒక్కరినీ టీడీపీ కూటమి ప్రభుత్వం అస్సలు వదలట్లేదు. కలుగులో దాక్కున్నా సరే, బయటికి లాగి మరీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సుమారు 150 మందికి పైగానే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్ట్ కావాల్సిన వారి జాబితా చాలా పెద్దదే ఉంది. మొత్తం 1500 సోషల్ మీడియా అకౌంట్లలో అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు పెద్ద ఎత్తునే ఫిర్యాదులు చేశారు. ఇప్పుడిక నేతలు, వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారి వంతు రానే వచ్చింది.
బూతుకు మంత్రం!
కొడాలి నాని.. ఈయన గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీడియా ముందుకు వస్తే చాలు నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడటమే పనిగా పెట్టుకుని, చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్.. వీరి కుటుంబ సభ్యులను ఎంతలా మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. పచ్చి బూతులు మాట్లాడి ఈయనకు అప్పగించిన పౌర సరఫరాల శాఖను పక్కనెట్టి, బూతు శాఖగా మంత్రిగా మారిపోయిన పరిస్థితి. వైసీపీ ఓడిపోయి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి అడ్రెస్స్ లేకుండా పోయిన పరిస్థితి. సుమారు ఆరు నెలలు గడిచినా మీడియా ముందుకు, జనాల్లోకి రాని కొడాలిని కేసులు బయటికి తీసుకొస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బూతు అనే భూతానికి పోలీసులు మంత్రం వేయబోతున్నారు.
సినిమా మొదలు!
మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని.. ఆ బూతులు, తిట్లు మహిళగా తాను భరించలేకపోయానని లా చదువుతున్న విద్యార్ధిని అంజనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించి, పరిశీలించిన సీఐ రమణయ్య.. మాజీ మంత్రి కొడాలిపై కేసు నమోదు చేశారు. 352(3),353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు పోలీసులు వెల్లడించారు. అంజన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు.
ఎప్పుడెప్పుడా..!
వాస్తవానికి ప్రభుత్వం మారిన తర్వాత అక్కడక్కడ ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంకా కొడాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు చేసిన, చేస్తున్న, చేయబోయే ఫిర్యాదులు, నమోదయ్యే కేసులు ఎలా ఉండబోతున్నాయి? కొడాలి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. కేసులు ఇప్పుడే మొదలు అయ్యాయి గనుక ఇక నాన్ స్టాప్ గానే కేసుల పర్వం నడుస్తోంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక చర్యలు ఎలా ఉంటాయ్ అన్నదే చూడాలి మరి.