సీఎం చంద్రబాబు తమ్ముడు కన్నుమూత
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తమ్ముడు, నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. మూడు రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. రామ్మూర్తి మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
అటు బాబు.. ఇటు లోకేష్..
రామ్మూర్తి ఆరోగ్యం విషమించిందని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లి పర్యటన మధ్యలోనే తిరిగి వచ్చేస్తున్నారు. ఇటు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే హైదరాబాద్ పయనమై వచ్చేశారు. కాగా రామ్మూర్తి నాయుడు, అన్న చంద్రబాబు బాటలోనే రాజకీయాల్లోకి వచ్చి రామ్మూర్తి 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున చంద్రగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇందుకు కారణం ఆయనకు ఆరోగ్యం సహరించక పోవడమే అని కుటుంబ సభ్యులు చెబుతుంటారు.