ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో, రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయ్యిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. పొగడ్తలతో ముంచెత్తి, ఆయన సేవలను కొనియాడారు. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారన్నారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఆయనొక పోరాట యోధుడు అని అభివర్ణించారు.
ఇదే స్క్రిప్ట్ అంటే..
ఈ సందర్భంగా ఆయన్ను వైసీపీ హయాంలో పెట్టిన ఇబ్బందులు ప్రస్తావించారు. జైల్లో రఘురామను కొడుతుంటే నాటి సీఎం వైఎస్ జగన్ ఆ దృశ్యాలు చూసి పైశాచిక ఆనందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామను ఎంపీగా నరసాపురం నియోజకవర్గానికి రానివ్వకపోతే, రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని వెల్లడించారు. నాడు రాష్ట్రానికి రానీయని వాళ్లు, నేడు రఘురామ ముందు సభలోకి రాలేని.. కనీసం కూర్చోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇది నిజంగానే దేవుడు రాసిన స్క్రిప్టు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
నాడు.. నేడు..
రఘురామ గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. నరసాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే, ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారని సెటైర్లు వేశారు. కర్మ అనేది ఎంత బలంగా ఉంటుంది అనేదానికి ఇదే తార్కాణం అని అన్నారు. వైసీపీపై పవన్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందని, రాజకీయాల్లో నేరస్థులకు స్థానం ఉండకూడదని హితవు పలికారు. దురదృష్టవశాత్తూ 2019లో నేరస్థులు అధికారంలోకి వచ్చారని వైసీపీ, వైఎస్ జగన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ మాట్లాడుతున్నంత సేపు సభ్యులు అలాగే తథేకంగా చూడసాగారు. మరికొందరైతే బల్లలు చరిచి, హ్యాపీగా ఫీలయ్యారు కూడా.