టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నటి, వైసీపీ మద్ధతురాలు శ్రీరెడ్డికి ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. వైసీపీ హయాంలో మొదలుకుని నిన్న మొన్నటి వరకూ ప్రత్యర్థులపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై, వారి కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. అత్యంత జుగుప్సాకరమైన పదాలతో మాట్లాడిన పరిస్థితి. అందులోనూ ఒక ఆడపడుచు అయ్యుండి.. సాటి మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అధికారంలో లేదు గనుక ఇన్నాళ్లు మౌనం పాటించిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడిక షురూ చేశారు. దీంతో ఇప్పటికే వీడియో రూపంలో క్షమాపణలు శ్రీరెడ్డి మరోసారి లోకేష్ అన్న అని సంబోధిస్తూ రెండు పేజీల లేఖ రాసింది. అంతే కాదు వైసీపీకి కూడా బహిరంగ లేఖ రాసింది.
లోకేష్ అన్నా అంటూ..!
గతంలో లోకేష్ గురుంచి ఇష్టానుసారం నోరు పారేసుకున్న ఈమె ఇప్పుడు అన్న అని సంబోధిస్తూ లేఖ రాసింది. లోకేష్ అన్నా మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకు మించి మంచితనం కూడా ఉంది. గత పదిరోజులుగా మీ కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే, అభ్యంతరకర మాటలు మాట్లాడి నేను ఎంత పెద్ద తప్పు చేసానో అర్థం అయ్యింది. పూజలు, ప్రార్థనలు చేసే నేను ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడానో, ఎందుకు ఇంత పాపం చేశానో అర్థం కావట్లేదు. అందుకే మీకు, మీ కుటుంబ సభ్యులకు.. పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులకు.. మీడియా ప్రతినిధులకు పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నాను. పెద్ద మనసుతో క్షమించి, నన్ను, మా కుటుంబాన్ని సోషల్ మీడియా, మీడియా, అలాగే కేసుల నుంచి బంధవిముక్తి కల్పిస్తారని వేడుకుంటున్నాను. అలాగే వైఎస్ షర్మిల, సునీత అక్కకు కూడా క్షమాపణలు. నేను సినిమాల్లో, రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను. నేను ఇకపై ఎవరిపైనా అభ్యంతరకర మాటలు మాట్లాడను.
నావల్లనే అంతా..!
జగనన్న, భారతమ్మకు నా హృదయ పూర్వక నమస్కారాలు. ఈ జన్మలో మిమ్మల్ని టీవీల్లో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదు. మీతో కలిసి ఒకే ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని కూడా నేను కోల్పోయాను. ఎందుకంటే నేను వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేకమంది వైసీపీని దుమ్మెత్తి పోయడం నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగ దీసింది. నేను కనీసం వైసీపీ సభ్యురాలిని కూడా కాదు. అభిమానం, పార్టీ మీద ఉన్న గౌరవంతో అంతకు మీరు పడిన జైలు, పాదయాత్ర కష్టాలు చూసి వీర విధేయతతో ఎక్కువై ప్రత్యర్థులను మాట్లడకూడని భాషలో తిట్టాను. నా వల్ల పార్టీకి డ్యామేజి అయ్యింది. నేను చేసిన ఈ పనుల వల్ల మీరు ఎంతగా బాధపడ్డారో నా పాపం మీరు అంటోద్దు. నేను పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా. నా వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదు క్షమించండి అంటూ శ్రీరెడ్డి లేఖలో రాసుకొచ్చింది. మొత్తానికి చూస్తే గట్టిగానే జ్ఞానోదయం అయ్యిందనే అర్థం చేసుకోవచ్చు. ఇదే మాట మీద ఉంటుందో లేదో చూడాలి మరి.