కూటమి ప్రభుత్వం ఏదో ఒక సమయం లోనైనా పాపం జగన్ అని వదిలేస్తుందేమో చెప్పలేం కానీ.. బ్లూ మీడియా అందులోను జగన్ ఏరి కోరి పెంచి పోషించిన మీడియా సంస్థ ఒకటి మాత్రం జగన్ ను వదలడం లేదు. కొన్నాళ్లుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని ఓ అంచనాకు రావడమే తరువాయి ప్లేట్ తిప్పేసి జగన్ సైడ్ నుంచి కాస్త బయటికి వచ్చి కథనాలు రాస్తుంది.
జగన్ కోటరీ గురించి వెలుగెత్తి చెప్పిన జగన్ అనుకూల మీడియా సంస్థ ఆ తర్వాత జగన్ చెసే మంచిపనులను, ఆయన చేసే చెడు ని తూకం వేసి మరీ పబ్లిక్ కి వినిపిస్తోంది. నిన్నగాక మొన్న జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పే అని చెప్పిన ఆ మీడియా సంస్థ ఇప్పుడు జగన్ ని ఇకపై ప్రజలెందుకు నమ్మాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
గత ఐదేళ్ళలో జగన్ తప్పిదాలను పూసగుచ్చినట్టుగా పబ్లిసిటీ చేస్తుంది. జగన్ మద్యం బ్రాండ్స్ దగ్గర నుంచి సాక్షి కి ప్రభుత్వ యాడ్స్ కట్టబెట్టడం వరకు, ప్రజా ధనంతో ఋషి కొండ భవనాలు కట్టడం, మీడియా సంస్థలను మ్యానేజ్ చేస్తూ తాడేపలి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోవడం, తల్లిని, చెల్లిని సోషల్ మీడియాలో దూషిస్తుంటే నిద్ర నటించడం దగ్గర వరకు జగన్ ని ఏకిపారేసింది సదరు జగన్ అనుకూల మీడియా సంస్థ.
అమరావతిని కాదని మూడు రాజధానులంటూ కాలయాపన చెయ్యడం, పోలవరాన్ని పట్టించుకోకపోవడం, ప్రతి పక్షం కోసం అడుక్కోవడం ఇలా దేన్ని చూసి ప్రజలు మళ్లీ జగన్ ను నమ్మి ఓట్లేస్తారో అంటూ జగన్ అనుకూల మీడియా సంస్థ జగన్ ను అడ్డంగా ఇరికించేసింది.