ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరిస్థితి ఇలా అయ్యిందేంటి?
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి దేశంలో మరెక్కడా లేని వింతలు, విచిత్రాలు అన్నీ ఇక్కడే చోటు చేసుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగానే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులు మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీలు ఇంకా ఆపై నేతల వరకూ ఏం చెప్పినా విని చక్కబెడుతూ వచ్చారు. ఇందుకు చక్కటి ఉదాహరణే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు. ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, కొమ్మారెడ్డి పట్టాభి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉంది. అయితే ప్రభుత్వం మారగానే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అప్పుడు జగన్ సర్కార్.. ఇప్పుడు టీడీపీ కూటమి తేడా ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వాల మధ్య పోలీసులు నలిగిపోతున్న పరిస్థితి.
తేడా ఏముంది..?
స్వతంత్రంగా విధులు నిర్వహించాల్సిన పోలీసులు, రాజకీయ నాయకుల జోక్యంతో వారి పని వాళ్ళు సక్రమంగా చేసుకునే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. ఇది జగమెరిగిన సత్యమే..! ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ప్రజా ప్రతినిధులు చెప్పిందల్లా విని, ఆచరణలో పెట్టాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా, లేకపోయినా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు ప్రమోషన్ల సంగతి అటుంచితే డిమోషన్లు గుర్తింపు రూపంలో వస్తుండటం గమనార్హం. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రభుత్వం ఏం చెప్పినా, మంచి అయినా.. చెడు అయినా అక్షరాలా పాటించడం పరపాటిగా వచ్చింది. ఐదేళ్లు ఇదే పరిస్థితి. సామాన్యుడి నుంచి రాజకీయ నేత వరకూ ఎవర్ని అరెస్ట్ చేయమన్నా.. హౌస్ అరెస్ట్ చేయమన్నా పై అధికారుల ఆదేశాల మేరకు జరగాల్సినవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ అధికారులు ఇప్పుడు ఎక్కడున్నారో..? ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సీన్ రిపీట్ అవుతోంది.
మంచిదే కానీ..!
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం వందకు వెయ్యి శాతం తప్పే. ఇలా చేసిన ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే. అది కూడా ఎలా ఉండాలంటే రేపటి రోజున ఎవరైనా ఇలాంటి పనులు చేయలన్నా.. సారీ చేయాలనే ఆలోచన వచ్చినా సరే ఒణికిపోయేలా ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వం చేయాల్సిన పనులు గుర్తు చేస్తే, ఇచ్చిన హామీల సంగతేంటి? అని అడిగితే అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు సబబు? పోనీ ఇవాళ ఉన్న ప్రభుత్వం రేపటి రోజున ఉంటే సరే, లేకుంటే ఇప్పుడిలా చేస్తున్న అధికారుల పరిస్థితేంటి? పోనీ ఉన్నతాధికారులు, రాజకీయ నేతల ఆదేశాలు పాటించకపోతే అసలుకే ఎసరొచ్చే పరిస్థితి. అందుకే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అని మొదట మనం అనుకున్నది. అసలు ఏంటో ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో..! ఏది తప్పో.. ఏది ఒప్పో.. ఎవర్ని అరెస్ట్ చేయాలో.. ఎవర్ని చేయొద్దో? ఎవరికి శిక్ష వేయాలి అనేది వారికి స్వేచ్ఛ ఇస్తే కదా? వాళ్లు, వీళ్లు అని కాదు.. ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛ, ప్రశాంతత పోలీసులకు ఇస్తే గానీ శాంతిభద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా ఉంటుంది.. లేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారుతున్న కొద్ది రివెంజ్ రాజకీయాలు, రివెంజ్ పోలీసింగ్ ఎక్కువవుతుందే తప్ప పైసా ప్రయోజనం లేదు.