హెడ్డింగ్ చూడగానే ఇదేంట్రా బాబు.. సమోసాలు ఏంటి? సీఐడీ విచారణ ఏంటి? ఇంత విచిత్ర వార్త అని అనుకుంటున్నారు కదా.. అవునండోయ్ మీరు వింటున్నది, చూస్తున్నది అక్షరాలా నిజమే. ఈ ఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదనుకోండి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సమోసా మిస్ అయ్యింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీఐడీ ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. ఇంత విచిత్రం ఎలా జరిగింది..? దీనికే సీఐడీ విచారణ..? అనే విషయాలన్ని తెలుసుకుందాం రండి.
ఇదీ అసలు సంగతి..
అక్టోబర్ 21న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి తొలిసారి ఆఫీసుకు వస్తున్నారని పేరుగాంచిన రాడిసన్ బ్లూ నుంచి సమోసాలు, కేకులను సీఐడీ చీఫ్ ఆర్డర్ చేశారు. ఐతే సీఎం రావడం, వెళ్లిపోవడం కూడా అయ్యింది కానీ ఆర్డర్ చేసిన సమోసాలు, కేకులు మాత్రం రాలేదు. దీంతో సీఎంకు మర్యాదలు చేయలేకపోయామన్న అవమానం సీఐడీ బాస్‌ను వెంటాడింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సీఐడీ చీఫ్ ఎందుకు రాలేదు? ఏమయ్యాయి? దీని వెనుక ఏం జరిగింది? అనేది విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏం తేలింది..?
ఉన్నతాధికారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు అసలు లోపం ఎక్కడ ఉంది..? ఏం జరిగింది..? అని లోతుగా విచారణ చేయగా తీరా తేలింది ఏమిటంటే.. సీఎం కోసం తెచ్చిన సమోసాలు, కేకులు సమాచార లోపం కారణంగా సీఎం భద్రత సిబ్బంది, బందోబస్తు కోసం వచ్చిన పోలీసు సిబ్బందికి ఇచ్చినట్టుగా తేల్చారు సీఐడీ అధికారులు. ఇదంతా సమన్వయ లోపం కారణంగా జరిగిందని తేలింది. ఇదంతా మూడో కంటికి తెలియకుండా సీఐడీ చూసింది కానీ బయటికి వచ్చింది. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ రగడ నెలకొంది.
అబ్బే అంతా తూచ్..!
చూశారుగా.. ఇదీ సమోసా, కేకు కథ. ఇవన్నీ సీఎం సిబ్బందికి చేరాయి కాబట్టి సరిపోయింది.. లేదంటే ఇంకేం జరిగేదో మరి. ఈ వ్యవహారం ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా పెద్ద చర్చ, అంతకు మించి రచ్చ అవుతోంది. దీన్నే సువర్ణావకాశంగా మలుచుకున్న బీజేపీ నేతలు, ప్రభుత్వ చర్యలు కామెడీగా ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. ఐనా.. ప్రజాసమస్యలు గాలికొదిలి ఈ సమోసా గోల ఏంటి..? అని సామాన్య ప్రజలు, నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఐతే ఇదంతా తూచ్ అని సీఐడీ.. ఆఖరికి సీఎం కూడా స్పందించి అవన్నీ విమర్శలు మాత్రమే అని వివరణ ఇచ్చారు.