ప్లీజ్ వదిలేయండి.. కూటమి సర్కార్‌కు శ్రీరెడ్డి రెక్వెస్ట్
శ్రీరెడ్డి.. ఈ పేరు, ఈమె గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఉన్నా, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా మీడియా, సోషల్ మీడియాలో ఎప్పుడూ పేరు మార్మోగిపోతుంటుంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈమె ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, చేష్టలు రాతల్లో రాయలేం అంతే. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని, ఏ పార్టీని వదలకుండా ఆఖరికి నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వీరి కుటుంబ సభ్యులపైనా ఇలా అందరిపైనా నోరు పారేసుకుని మాట్లాడేసింది. పోనీ విమర్శలు అంటే అదేదే పద్ధతి, విధానం ఉంటుందా అంటే అబ్బే.. నోరు తెరిస్తే పచ్చి బూతులు, మదమెక్కి.. అహంకారంతో మాట్లాడిన మాటలే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ పోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
గతంలో ఇలా..
ఇక చూస్కోండి.. గత వైసీపీ హయాంలో ఎవరైతే ఇలా చిల్లర మాటలు మాట్లాడి, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు, మాటలు మాట్లాడారో ఆ సోషల్ సైకోలు అందర్నీ వేటాడి మరీ పట్టుకుంటోంది. ఇప్పటికే రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి వారిలో శ్రీరెడ్డి కూడా ఒకరు. త్వరలోనే అరెస్ట్ చేస్తారనే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయ్యి, ప్లీజ్.. క్షమించి వదిలేయండి అని చేతులెత్తి మరీ వీడియో రూపంలో వేడుకుంటోంది.
వీడియోలో ఏముంది?
నారా లోకేష్ , నారా భువనేశ్వరి, పవన్ కల్యాణ్ వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు చెబుతున్నాను. నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని (నాకు భవిష్యత్తు లేదనుకోండి నేను పెళ్లీ పెటాకులు అని అనుకోవట్లేదు), నా వల్ల నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపైన నా సోషల్ మీడియా నుంచి ఎలాంటి అసభ్యకర, అభ్యంతర పోస్టులు రావు, పెట్టను. యుద్ధం అనేది కార్యకర్తలు మీద కాదు, లీడర్లు-లీడర్ల మధ్య జరగాలి.. మీరు మీరు చూస్కోండి అని కూటమి ప్రభుత్వానికి శ్రీరెడ్డి ఉచిత సలహా ఇచ్చింది. ఇదీ శ్రీరెడ్డి వీడియో సారాంశం. ఈ వీడియోపై టీడీపీ, జనసేన కార్యకర్తల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. గతంలో జరిగిన ఘటనలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.