సోషల్ మీడియా.. ఈ మాధ్యమాన్ని అనవసర విషయాలకు వాడకం ఎక్కువైంది. గత ఐదారేళ్లుగా పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అసభ్యకర పోస్టులు, ఫోటోలు, వీడియోలతోనే కొందరు సోషల్ మీడియాను నింపేస్తున్నారు. దారుణాతి దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇంకొందరు పైశాచిక ఆనందాన్ని ఆస్వాదించిన పరిస్థితి. మరికొందరు ఏకంగా నేతల భార్యల గురుంచి, వారి పిల్లల గురుంచి ఇష్టానుసారం మాట్లాడటం, సోషల్ పిచ్చి రాతలు రాయడం చేశారు. ఎంతలా అంటే మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరేం తక్కువ కాదు. వైసీపీని తిట్టలేం.. అలాగనీ టీడీపీని ఏమీ అనలేం. పోటా పోటీగా తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు కూడా.
నాడు.. నేడు..
ఐతే.. ఇదే రివర్స్ అయ్యి ఇప్పుడు కేసులు, కోర్టులు అనేసరికి దెబ్బకు దేవుడు గుర్తొచ్చినంత పని అయ్యింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉండగా కొందరు కార్యకర్తలు, నేతలు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారనేది అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడిప్పుడే ఆ మదమెక్కిన వాళ్ల భరతం పట్టి.. తోలు తీస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. గత నాలుగైదు రోజులుగా గతంలో ఎవరైతే సోషల్ విర్ర వీగారో వాళ్ళ బాగోతం బయటపెట్టి.. అరెస్టులు చేస్తున్న పరిస్థితి. చూశారుగా నాడు.. నేడు ఎంత తేడా ఉందో..!
వదిలేదేలే.. !
గత కొన్ని రోజులుగా జరుగుతున్న అరెస్టులు, ప్రస్తుత పరిణామాలపై యంగ్ అండ్ డైనమిక్ లేడీ ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిల్లలను కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం దారుణం అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన శబరి.. మహిళలు అన్ని రంగాలల్లో రాణిస్తూ ఉంటే వాళ్ళ క్యారెక్టర్లపై పోస్టులు చేయడం ఏంటి..? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు చేస్తే ఎంతటి వారినైన వదిలేది లేదని హెచ్చరించారు. మరోవైపు.. అన్ని రంగాల్లో వెనుకబడ్డ నంద్యాల జిల్లాకు సీఎం చంద్రబాబు సహాయ, సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రిని ఎంపీ కోరారు.