జైలుకు వెళ్లడానికి రెడీ అంటున్న కేటీఆర్
అవును.. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించేశారు. గత కొన్ని రోజులుగా ఫార్ములా ఈ- రేస్ అవకతవకల విషయంలో అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అనే ప్రకటన వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు మొదలుకుని మంత్రుల వరకూ గట్టిగానే హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చిన ఆయన నేను రెఢీ అంటూ ప్రకటన చేసేశారు. తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే.. తాను ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా చెప్పేశారు.
ఏమవుతుంది..?
అవును.. నాపై కేసు పెట్టాలనుకుంటే, పెట్టుకోండి.. అరెస్ట్ కూడా చేసుకోండి. రెండు మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా వెళ్తాను. యోగా చేసుకుని ఫిట్‌గా తయారయ్యి బయటికొస్తాను. తర్వాత పాదయాత్రకు సిద్ధం అవుతాను. టార్గెట్ కేటీఆర్‌పై కాదు.. ప్రజా సమస్యలపై పెట్టాలి. ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు. నాకు న్యూస్ పేపర్లకు సంబంధించి మాత్రమే నోటీసులు వస్తున్నాయి. విచారణకు గవర్నర్ అనుమతినిస్తే ఆయన విచక్షణకు వదిలేస్తాను. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయటపడింది. బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు.
అభివృద్ధి చేసినందుకా?
హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచినందుకు నాపై కేసు పెడతారా? F1 రేసుల వల్లే మొనాకో దేశం ప్రపంచానికి తెలిసింది. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేసేందుకే ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించాం. ఫార్ములా వన్ రేసులు మన దేశంలో కొత్త కాదు. ఈ రేస్ వల్ల హైదరాబాద్‌కు జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు. నాపై కోపంతో ఈ రేస్ రద్దు చేశారు. సీఎం నిర్ణయంతో అంతర్జాతీయంగా పరువు పోయింది. రేవంత్ ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? కామన్వెల్త్ గేమ్స్ అంటేనే కాంగ్రెస్ స్కామ్ గుర్తుకొస్తుంది. అటెన్షన్ డైవర్షన్ కోసం సీఎం రేవంత్ ఇవన్నీ చేస్తున్నారు. నాకు ఇప్పటి వరకూ ఎలాంటి నోటీసు రాలేదు. రూ. 55 కోట్లు ఇచ్చింది వాస్తవం.. నేను ఏమైనా తీసుకున్నానా? అరవింద్ కుమార్‌ను డబ్బులు చెల్లించాలని నేనే ఆదేశించాను. హెచ్ఎమ్‌డీఏ నుంచి డబ్బులు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం అవసరం లేదు. నాపై ఇష్టమొచ్చిన కేసులు పెట్టుకోండి.. అరెస్ట్ చేసుకోండి. రూ.50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్‌పై 8 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేవు అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.