జగన్ జుట్టు జనసేనాని చేతిలో ఉందా?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జుట్టు, గుట్టు రెండూ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతిలో ఉన్నాయా? తానేంటో, తన పవర్ రుచి చూపించడానికి సేనాని రంగం సిద్ధం చేశారా? అతి త్వరలోనే జగన్ గుట్టు జనాల ముందు ఉంచి, ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా? అవసరమైతే అరెస్ట్ చేయించడానికి కూడా మొత్తం ప్లాన్ చేసేశారా? అంటే ఏపీలో తాజాగా నడుస్తున్న కొన్ని రాజకీయ పరిణామాలు, పరిస్థితులను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ మాజీ సీఎం ఏం చేశారు..? పీకల్లోతు ఇరుక్కుపోయేంతగా అందులో ఏముంది? స్వయంగా పవన్ పరిశీలించిన తర్వాతే క్లారిటీ వచ్చేసిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు సంగతి..
వైఎస్ ఫ్యామిలీలో సరస్వతి భూములపై రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్న మోసం చేశారని చెల్లి.. మొత్తం చెల్లి, తల్లి చేశారని అన్న ఒకరిపై ఒకరు ఆరోపణలు, లేఖాస్త్రాలు చేసుకుంటూ రోడ్డెక్కాశారు. ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీలో ఈ వ్యవహారం నడుస్తోంది. సరిగ్గా ఈ క్రమంలోనే అసలు ఏమిటీ సరస్వతి భూముల వ్యవహారం? ఈ భూముల్లో ఏముంది..? అని ఆరాతీసిన డిప్యూటీ సీఎం.. నాడు వైఎస్ హయాంలో 2009 లీజుకు తీసుకున్న భూములు మొదలుకుని, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 50 ఏళ్లకు లీజుకు పెంచడం వరకూ ఎప్పుడేం జరిగింది? ఇందులో అటవీ భూములు ఎన్ని? రెవెన్యూ భూములు ఎన్ని? ఇదంతా లెక్క తేల్చి నివేదిక రూపంలో ఇవ్వాలని ఇప్పటికే ఆయా గ్రామాల అధికారులు మొదలుకుని జిల్లా ఉన్నతాధికారుల వరకూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని గ్రామాల్లో అసలు భూముల ఆక్రమణ జరగలేదని తేలింది. ఇందులో నిజమెంత అని తెలుసుకోవడానికి స్వయంగా తానే రంగంలోకి దిగి పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలో సరస్వతి భూములను పరిశీలించారు.
పవన్ ఏం తేల్చారు?
మొత్తం 1384 ఎకరాల సరస్వతి పవర్ ప్రాజెక్టు భూముల్లో 400 ఎకరాల అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారని డిప్యూటీ సీఎం తేల్చారు. అంతేకాదు.. 24 ఎకరాల అసైన్డ్ భూములు ఇందులో చెరువులు, కుంటలు సహజ వనరులు ఉన్నాయని తేల్చేశారు. ఈ భూములను అప్పట్లో రైతులు ఇష్టంతో అమ్మలేదని కూడా తేలింది. అయితే రైతుల పిల్లలకు ఉద్యోగాల ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఇవన్నీ కాదు ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ ఎందుకు కదల్లేదు? అనేదానిపై లోతుగా విచారణకు సైతం కలెక్టర్‌ను ఆదేశించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇన్నేసి ప్రజల భూములు లాక్కొని జగన్ ఫ్యామిలీ కొట్టుకుంటోందని మండిపడ్డారు. నాడు కోడెల శివప్రసాద్ 20 లక్షల రూపాయిల ఫర్నీచర్ తీసుకున్నారని వేధించి చంపేశారు.. ఇప్పుడు మీరెందుకు రైతులకు పరిహారం ఇవ్వలేదని జగన్‌ను నేరుగానే అటాక్ చేశారు. అంతేకాదు భూముల విషయం అనేది రాష్ట్ర సమస్య.. ప్రజా సమస్య అని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
దొరికినట్టేనా?
పవన్ లెక్కలను బట్టి చూస్తే.. జగన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లే. ఇదే విషయాన్ని ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తే అసలు నిజాలన్నీ బయటికొస్తాయి. ఎందుకంటే అటవీ శాఖ, పర్యావరణ శాఖ రెండూ పవన్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, గట్టిగానే జగన్‌ను పట్టుకోవచ్చు, ఇరికించేయొచ్చు అని బహుశా పవన్ కల్యాణ్ భావిస్తున్నారేమో. ఇందుకే జగన్ జుట్టు, గుట్టు పవన్ చేతిలో ఉందన్నది. ఇప్పుడిక పవన్ ఏం చేయబోతున్నారు..? కేబినెట్ భేటీలో ఈ విషయాలన్నీ ప్రస్తావించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అవసరమైతే ఈ విషయంలోనే జగన్‌ను అరెస్ట్ చేస్తారని కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ వర్గాలు స్పందిస్తూ.. సరస్వతి పవర్ భూములు ఇప్పటికే పట్టా భూములని.. అవేమీ అటవీ భూములు కాదని కేంద్రం తేల్చేసింది. ఇటీవలే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎమ్మార్వో కూడా డిక్లేర్ చేశారని చెబుతోంది. పల్లెల్లో సాధారణ రైతులకు 5 ఎకరాలు ఉంటేనే ఎక్కడ కుక్కలు, నక్కలు, పందులు వస్తాయో? అని ఫెన్సింగ్ వేసుకుంటారు. అలాగే జగన్ కూడా మీ భూముల వరకూ ఫెన్సింగ్ వేసుకో సామీ అని వైసీపీ కార్యకర్తలు సూచిస్తున్నారు. ఏమో.. ఏమైనా జరగొచ్చు.. జరగరానిది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి.