వేమిరెడ్డి అంటే లెక్కలేదా.. బొకే ఇవ్వరేం
అధికార టీడీపీలో ఎంపీకి కనీసం గౌరవం లేకుండా పోయింది..! ఎంతలా అంటే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఆఖరికి ఈ రెండూ కాని నేతలకు మర్యాద ఉంది కానీ.. ఎంపీకి లేకపోవడం గమనార్హం. ఇదంతా జిల్లాలో పట్టు కోసం మంత్రులు చేస్తున్నారా..? లేకుంటే అనుకోకుండా పొరపాటు జరిగిందా అనేది తెలియట్లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం జరిగితే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన వచ్చారని సోయ కూడా లేకుండా అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వ్యవహరించారు. ఆయన పేరు కానీ.. కనీసం బొకే కూడా ఇచ్చి ఆహ్వానించకపోవడం గమనార్హం. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఏమో కానీ అసలు ఈ సమావేశంలో ఉండటం ఎంతవరకు సమంజసం? ఇంత అవమానం జరిగాక కూడా సమావేశంలో ఎందుకు ఉండాలని బయటికి వచ్చేశారు. ఆయనతో పాటు ఇదే సమావేశంలో ఉన్న కోవూరు ఎమ్మెల్యే, వేమిరెడ్ది సతీమణి వేమిరెడ్ది ప్రశాంతి రెడ్డి కూడా బయటికి వచ్చేశారు.
ఏమిటిది.. ఎందుకిలా?
జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్ఎండీ ఫరూక్.. ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాళ్ళు అంతా మంత్రులు, ఎమ్మెల్యేలు కావడంతో ఎక్కడా పేరు, మర్యాదలు.. బొకేలతో స్వాగతాలు మరువని అధికారులు, ఎంపీ వస్తే పేరు పిలవకపోవడం, కనీస మర్యాద ఇవ్వకపోవడంతో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. స్వయంగా కలుగజేసుకొని మంత్రి ఆనం, జిల్లా కలెక్టర్ క్షమాపణలు చెప్పినా.. తిరిగి వేదికపైకి తీసుకొని రావడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే అస్సలు వినలేదు.. పట్టించుకోలేదు. నా జీవితంలో ఇలాంటి అవమానం చూడలేదు.. పిలిచి ఇంతలా అవమానిస్తారా అంటూ అసహనంతో వెళ్ళిపోయారు. సదరు అధికారి కారు దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పి, జరిగిన తప్పుకు వివరణ ఇచ్చినా సరే అస్సలు పట్టించుకోకుండా అవమానం, అసహనం అంతకు మించి కోపంతో కారు ఎక్కి వెళ్ళిపోయారు ఎంపీ. వాస్తవానికి వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులందరికీ బొకేలు ఇచ్చి స్వాగతం పలకాలి. ఆ విషయాన్ని ఆర్డీఓ విస్మరించారన్న అభిప్రాయం ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రోటోకాల్ పై కనీస అవగాహన లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఆఖరికి ఆదివారం సాయంత్రం ఎంపీ ఇంటికి మంత్రులు, జిల్లా కీలక నేతలు వెళ్ళినా శాంతించలేదు.
ఇంత పెద్ద మనిషిని..!
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రాజకీయాల కంటే ముందుగా సమాజ సేవకుడిగా, వ్యాపారవేత్తగా మంచి పేరు, అంతకు మించి గుర్తింపు కూడా ఉంది. ఫౌండేషన్ స్టాపించి ఈయన సతీమణి ప్రశాంతి రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఇలా అటు ప్రజాసేవ.. ఇటు వ్యాపారవేత్తగా ప్రజల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుపరిచితుడు కావడంతో వేమిరెడ్డి కన్నుపడటంతో పార్టీకి ఆర్థికంగా పనికొస్తారని ప్లాన్ చేసి మరీ రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. దీనికితోడు ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు మరింత తోడ్పడుతాయని కుటుంబ సమేతంగా అరంగేట్రం ఇచ్చేశారు. తొలిసారి రాజ్యసభకు పంపిన వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.
నాడు.. నేడు..!
ఐతే.. కొన్ని అనివార్య కారణాలు, పార్టీ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందుల రీత్యా ఫ్యాన్ పార్టీని పక్కనబెట్టి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు వేమిరెడ్డి దంపతులు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీమణి ప్రశాంతికి టికెట్ ఇవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అప్పటినుంచి ప్రశాంతంగా నడుస్తున్న రాజకీయ జీవితంలో ఉన్నపలంగా ఒక్క కుదుపు లాంటి వార్త. దీంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా టీడీపీకి ఒకింత ఆందోళన మొదలైంది. ఎందుకంటే నాడు వైసీపీ నుంచి తనకు కనీస మర్యాద, గౌరవం దక్కలేదని పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. నేడు ఎక్కడ మళ్ళీ టీడీపీని వీడుతారో అని ఉలికిపాటుకు గురైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ మర్యాద దక్కలేదని ఇక్కడికి వస్తే కొందరు కోటరిగా ఏర్పడి ఇలా పనిగట్టుకుని చేస్తున్నారు అనే అనుమానాలు లేకపోలేదు. చివరికి నెల్లూరు పెద్దారెడ్డి పంచాయితీ ఏమవుతుందో..? ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.