ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అటు యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేశ్, ఇటు విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ఐదేళ్లు పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేకపోగా ఉన్న కంపెనీలు సైతం వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తొలుత రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమెరికాలో పర్యటిస్తున్న లోకేశ్ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో టెస్లా, ప్రపంచ ప్రఖ్యాత డేటా బేస్ సెంటర్ ఈక్వెనెక్స్, ఫెరోట్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యి, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు నిశితంగా వివరించారు. అనంతపురంలో పెట్టుబడులు పెట్టాలని టెస్లాను లోకేశ్ ఆహ్వానించారు.
సత్యనాదెళ్లతో భేటీ..
మంగళవారం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఏపీలో ఐటీ, ఏఐ, స్కిల్ డెవలప్‌మెంట్ రంగం అభివృద్ధికి మద్దతు కోరారు లోకేశ్. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చి దిద్దేందుకు సహకరించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో కొత్త ఐటీ హబ్స్, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నట్లు. ఐటీ హబ్స్ ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని సీఈఓను కోరారు. ప్రపంచస్థాయి సంస్థలకు ఏపీ ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. పెట్టుబడి అనుకూల విధానాలు, భూమి ఏపీలో ఉందని, క్లౌడ్ సేవలలో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి వెళ్లాలని, అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నట్లు సత్యనాదెళ్లకు నిశితంగా వివరించారు.
గ్లోబల్ లీడర్!
సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ అని సత్య నాదెళ్ల వివరించారు. 2023లో మైక్రోసాఫ్ట్ 211.9 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందని గర్వంగా చెప్పుకున్నారు. మొత్తానికి చూస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసిందని, రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు అన్నీ విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియాసుబ్రహ్మణ్యంతో మంత్రి భేటీ అయ్యారు. యాపిల్ సంస్థ తయారీ యూనిట్ ఏర్పాటుకు
ఏపీ అనుకూలమైన ప్రదేశమని నారా లోకేశ్ వివరించారు. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి, ఏపీని సందర్శించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. అంతర్జాతీయ పెట్టుబడులకు కూడా మద్దతిస్తామని యాపిల్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మొత్తానికి చూస్తే.. ఏపీలో త్వరలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను ఆంధ్రులు చూడబోతున్నారు.