అయ్యో.. ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు ఇలా అయ్యిందేంటి? అని ఫాలోవర్స్, వీరాభిమానులు హర్ట్ అవుతున్నారు. తెలంగాణలో రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కనీసం పదవి లేదు.. పాడు లేదు.. ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందంటూ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. పోనీ ఉన్నచోట అయినా ఉండనిచ్చారా అంటే అదీ లేదు.. అక్కడికి పంపి కనీసం పదవి ఇవ్వకుండా ఎందుకిలా చేశారో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి పీఎంవోలో ఉన్న ఆమ్రపాలిని ఏరికోరి మరీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రప్పించుకున్నారు. అయితే ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఏపీకి వెళ్లాలని ఆదేశాలు వచ్చాయి. ఇక్కడే ఉండాలని క్యాట్, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆమ్రపాలితో పాటు మరో నలుగురికి నిరాశే ఎదురయ్యింది. దీంతో చేసేదేమీ లేక ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.
ఊరించి.. ఊరించి!
ఆమ్రపాలికి అలా రిలీవ్ అయ్యింది ఆలస్యం అదిగో ఇదిగో అంటూ ఊరించారు. సీఎంవోలో కీలక పదవి అని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీలోకి అని, జీవీఎంసీ కమిషనర్ బాధ్యతలు ఇవ్వబోతున్నారని ఇలా ఎన్నెన్నో లీకులు సచివాలయం నుంచి వచ్చాయి. సీన్ కట్ చేస్తే నాటి నుంచి నేటి వరకూ కనీసం ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. పాపం ఆ వార్తలు అన్నీ చూసిన ఆమ్రపాలి కూడా ఎన్నెన్నో అనుకుని ఉండొచ్చు. కానీ చివరికి ఎందుకిలా జరిగిందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆమ్రపాలితో పాటు వెళ్లిన ఒక ఐఏఎస్‌కు పదవి ఇచ్చి ఈమెకు ఇవ్వకపోవడంతో లేని పోని ప్రచారం జరుగుతోంది.
ఇందుకేనా?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆమ్రపాలి మళ్లీ ఇంటర్‌స్టేట్ డిప్యుటేషన్‌పై తిరిగి తెలంగాణకు వస్తారని తెలుస్తోంది. తెలంగాణకు పంపాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే పట్టుబట్టారని తెలుస్తోంది. ఎందుకంటే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్ పదవులకు ఆమె అయితే సరిగ్గా సెట్ అవుతారని ఆయన భావిస్తున్నారట. ఇందుకు గట్టిగానే కేంద్రంలోని ఒకరిద్దరు పెద్దలతో మంతనాలు చేస్తున్నారని తెలిసింది. ఇవన్నీ తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా మిన్నకుండిపోయారని సమాచారం. ఒకవేళ ఇది వీలుకాని పక్షంలో సీఎంవోలో కీలక పదవి ఉంటుందట. చివరికి ఏమవుతుందో..? ఏపీలో ఉంటారో..? తెలంగాణకు వస్తారో చూడాలి మరి.