ఎన్నో వివాదాలతో ఎప్పటికప్పుడు చెలగాటం ఆడుతూనే ఉన్నా రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన మంచి అవుట్ ఫుట్ కిల్లింగ్ వీరప్పన్ సినిమా. అదే సినిమాతో ఒక నటుడు వెలుగులోకి వచ్చాడు. ఆ సినిమా తాలూకు రివ్యూస్ అన్నిట్లోనూ అతనికి మంచి ప్రాధాన్యత లభించింది. ఇంకేం.. అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో పాత్రలు లభించాయి.
అయితే అభినయంలో తన సమర్ధత చూపుకోవాల్సిన సదరు నటుడు బీర్లు తాగుతూ దానిపై రివ్యూస్ ఇస్తాడు. వెటకారంగా కామెంట్స్ కూడా చేస్తాడు. అదేమంటే నేను తాగిన ద్రవం పట్ల నా స్పందన ఇదీ అంటాడు. తాగిన ద్రవం పట్ల ఇతగాడు స్పందించవచ్చట. చూసిన సినిమా పట్ల ఎవరూ స్పందన తెలియచేయకూడదు.. విశ్లేషణలు రాయకూడదట. అవి ఈ వికృత వ్యక్తిత్యానికి విరోచనాలట.!
బలగం చిన్న సినిమానే. భారీగా మోసింది మీడియానే. మత్తు వదలరా చిన్న సినిమానే. మహా గొప్పగా పొగిడింది మీడియానే. 35 చిన్న కథ కాదు అని చాటి చెప్పిందీ, మసూదా, పొలిమేర వంటి థ్రిల్లర్స్ కి థ్రిల్లింగ్ రిజల్ట్ వచ్చేలా చేసిందీ మీడియా నే. సంక్రాంతి వంటి సాలిడ్ సీజన్ లో మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ క్రౌడ్ పుల్లింగ్ ఫాక్టర్ తట్టుకుని తేజ సజ్జ వంటి యువ నటుడు హనుమాన్ తో అఖండ విజయం సాధించడానికి దోహదపడింది మీడియా నే.
నిజంగా బాగున్న సినిమాని నియంత్రించగలిగే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. సినిమాలో విషయం లేకుండా ప్రచారంతో ప్రభావం చూపించేద్దాం, పబ్బం గడిపేసుకుందాం అంటే కుదరదిక్కడ. మన ప్రోడక్ట్ కి ఆశించిన ఫలితం రానప్పుడు రీజన్స్ ఏంటో చూడాలి, రియలైజ్ అవ్వాలి. రివ్యూవర్ల మీద పడి ఏడిస్తే ఏం లాభం.!
అది మత్తో, మదమో తెలియదు కానీ నేడు సదరు నటుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అనే అందరూ అభిప్రాయపడుతున్నారు. మేకప్ వేయగానే డైలాగులు చెప్పడం, మైక్ దొరగ్గానే మైకంలో మాట్లాడేయడం సరి కాదని అతనికే హితవు పలుకుతున్నారు. చూద్దాం... అయ్యంగార్ అయ్యగారి భవిష్యత్ బాట ఏమిటో..!