బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వకు గుండెపోటు వచ్చిందా? ఇప్పుడామె పరిస్థితి ఎలా ఉంది? ఈ రియాలిటీ షో నుండి బయటికి పంపించారా? హాస్పిటల్‌లో చేర్పించారా? అనేలా.. తాజాగా ఆమె గురించి వినిపిస్తోన్న వార్తతో ఒకటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు సీజన్ 4 కంటెస్టెంట్‌గా చేసిన గంగవ్వను బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకున్నారు. ప్రస్తుతం యంగ్ కంటెస్టెంట్స్‌తో పాటు గంగవ్వ కూడా ఈ షోలో కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే ఉన్నట్టుండి గంగవ్వకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా ఓ వార్త మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియా సర్కిల్స్‌లో వైరలైంది. ఎవరు దీనిని పుట్టించారనేది తెలియదు కానీ. బాగా ప్రచారమైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న గంగవ్వకు గుండెపోటు వస్తే.. ఎలా తెలిసింది? ప్రతి వారం వచ్చే లీక్‌ల మాదిరిగా ఇది కూడా బయటికి వచ్చిందా? అని ఈ షో డైహార్డ్ ఫ్యాన్స్ కూడా నమ్మేసి.. అసలేం జరిగి ఉంటుందనే దానిపై ఆరా తీయడం మొదలెట్టారు.
గంగవ్వకు గుండెపోటు రావడంతో హౌస్‌లోని సభ్యులు టెన్షన్ పడ్డారని, వెంటనే డాక్టర్ల బృందాన్ని హౌస్‌లోకి పంపారనేలా వస్తున్న వార్తలలో నిజంలేదనేలా టాక్ వినబడుతోంది. కొందరేమో.. ఇదంతా ఫ్రాంక్ అని, కావాలనే బిగ్ బాస్ గంగవ్వతో ఇలా చేయిస్తున్నాడనేలా కూడా వార్తలు వినబడుతున్నాయి. టీఆర్పీ కోసం గంగవ్వకు బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ ఇచ్చి ఉంటారేమో అనేలా వార్తలు వైరల్ అవుతోన్న నేపధ్యంలో గంగవ్వతో తరుచూ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేసే మై విలేజ్ షో సభ్యులు మాత్రం ఈ వార్తలన్నింటినీ ఖండిస్తున్నారు. గంగవ్వపై వస్తున్న వార్తలు విన్న మై విలేజ్ షో సభ్యులు.. వెంటనే బిగ్ బాస్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చినట్లుగా వారు చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటనేది ఆ బిగ్ బాస్‌కే తెలియాలి.