ఏ క్షణాన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందో నాటి నుంచి నేటి వరకూ అన్నీ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అది కూడా ఒకటి తేరుకోక ముందే మరొకటి.. దీంతో పార్టీ, క్యాడర్ ఒకింత డీలా పడిపోతున్న పరిస్థితి. అయినా సరే జీరో నుంచి పార్టీ, జగన్ హీరో అవుతారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ ఎంపీలు ముగ్గురు రాజీనామా చేయగా మరొకరు రాజీనామాకు రెడీ అవుతున్నారట. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరు..? ఎందుకు రాజీనామా చేస్తున్నారు..? ఏ పార్టీలోకి వెళ్తారు.. అనే టెన్షన్ మొదలైంది.
ఆపరేషన్ ఆకర్ష్..
వైసీపీకి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. క్రిష్ణయ్య రాజీనామా చేశారు. ఇక మిగిలింది కేవలం 8 మంది మాత్రమే. ఈ నంబర్ త్వరలోనే మారుతోందట. 8లో ఒకటి తగ్గి 7 కాబోతోందట. ఎందుకంటే మరో ఎంపీ రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నారట. వాస్తవానికి ఇప్పుడు సభ్యులుగా ఉన్నది విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పరిమళ్ నత్వాని, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి. వీరిలో ఎవరు రాజీనామా చేయబోతున్నారన్నది ఇప్పుడు అధినేతకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదట. అయితే ఇదంతా అటు బీజేపీ.. ఇటు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ భాగంగానే జరుగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఎలా తెలిసింది..?
వాస్తవానికి ఇప్పుడున్న 8 మంది వైఎస్ జగన్ వీర విధేయులే. అయితే ఇందులో ఎవర్నీ శంకించడానికి లేదు కానీ.. ఒకరైతే రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారట. ఎందుకంటే లోక్‌సభలో బలంగా ఉన్న ఎన్డీఏ.. రాజ్యసభలో వీక్‌గా ఉంది. అందుకనీ ఎవరొచ్చినా సరే లేదంటే రాజీనామా చేసినా సరే తమ అభ్యర్థులను నిలపడానికి టీడీపీ, బీజేపీ సిద్ధమవుతోంది. ఖాళీ అయిన స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా.. రాజీనామాతో ఇంకాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కడు ఎవరో.. రాజీనామా చేస్తారో లేకుంటే డైరెక్టుగా వేరే పార్టీ కండువా కప్పుకుంటారో చూడాలి. సిట్టింగులు వరుస చర్యలతో జగన్ రెడ్డికి పెద్ద తలనొప్పే వచ్చి పడింది.