ఏపీకి వెళ్ళాలంటే ఐఏఎస్‌లకు భయం ఎందుకో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలంటే ఐఏఎస్ అధికారులు జంకుతున్నారు..? తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బదిలీలు అంటే చాలు అమ్మో అంటున్నారు. ఐనా ఏపీ అంటే ఎందుకు ఇంత భయం..? అదేమైనా రాష్ట్రం కాదా..? అక్కడ ప్రభుత్వం లేదా..? లేకుంటే ప్రజలు లేరా..? ప్రజలకు సేవ చేయాలని అధికారులకు లేదా..? ప్రజలకు సేవ చేయాలనే కదా ఉద్యోగంలో చేరింది..? అనే మాటలకు మాత్రం కొందరి నుంచి ఎలాంటి సమాధానాలు రావట్లేదు. పైగా క్యాట్, కోర్టులు అంటూ హడావుడి చేస్తున్న పరిస్థితి. ఇదంతా ఎవరి గురుంచి.. ఎందుకు అనేది ఈ పాటికే అర్థం అయ్యే ఉంటుంది కదా..!
ఇదీ అసలు సంగతి..
తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రోస్, కాట ఆమ్రపాలి లను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. స్వరాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా కేంద్రం పంపింది. ఐతే.. ఈ ఇద్దరు మాత్రం తెలంగాణలోనే కొనసాగుతామని క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో వివాదం తలెత్తింది. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన వేర్వురుగా క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. చేశారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేసి, తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరారు. ఈ పిటిషన్లపై క్యాట్ మంగళవారం నాడు విచారించింది.
గట్టిగానే చివాట్లు..
ఐతే.. ఆయా అధికారులకు క్యాట్ గట్టిగానే చివాట్లు పెట్టింది. ఏపీ ప్రజలకు సేవ చేయాలని లేదా..? అంటూ ఐఏఎస్‌లపై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా..? అంటూ క్యాట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయంటూ క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐతే.. ఎలాగైనా సరే తెలంగాణలో ఉండాలనే ఉద్దేశంతో క్యాట్ తీర్పుతో హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఐఏఎస్ అధికారులు ఉన్నారు. హైకోర్టులో బుధవారం నాడు ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. ఈ మేరకు.. ప్రభుత్వ సలహాదారుతో సీనియర్ ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ కేటాయింపులు, క్యాట్ చివాట్లు, కోర్టు వ్యవహారంపై పెద్ద ఎత్తునే తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. చివరికి ఏం జరుగుతుందో..? ఏపీకి తప్పక వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో లేదంటే.. తెలంగాణలోనే ఉండటానికి హైకోర్టు గుడ్ న్యూస్ చెబుతుందో చూడాలి మరి.
ఎందుకిలా..?
ఏపీకి వెళ్ళడానికి ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు..? అనే విషయానికి వస్తే గత అనుభవాలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. వైఎస్ హయాంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఆఖరికి జైలు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఏపీకి వెళ్ళాలంటే అధికారులు కాసింత భయపడుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. గత ప్రభుత్వంలో పని చేసిన చాలా మంది ఉన్నతాధికారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కనీసం పోస్టింగులు కూడా లేకుండా ఖాళీగా కూర్చోబెట్టడం, దీనికి తోడు ఫైనాన్స్ అంశాల విషయంలో సెక్రటరీలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ చూస్తున్న అధికారులు ఏపీకి వెళ్ళాలంటే బెంబేెత్తిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఏపీకి రాజధాని లేకపోవడం, కనీసం విలాస జీవితం గడపటానికి కూడా సరియిన సౌకర్యాలు లేకపోవడం ఒక ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరం ఏపీకి లేకపోవడంతో ఐఏఎస్ అధికారులు భయానికి కారణమని తెలుస్తోంది.