అనన్య నాగళ్ల మంచి చెప్పినా.. సోషల్ మీడియాలో నెగిటివిటీ వ్యక్తమవుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్య ఈ వకీల్ సాబ్ నటి పేరు ఎలా వైరల్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలలో వరదలు సంభవించినప్పుడు.. ఏ స్టార్ హీరోయిన్ స్పందించని విధంగా ఆమె స్పందించి రెండు రాష్ట్రాలకు రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఆమె మంచి మనసును అందరూ ఎంతగానో అభినందించారు. అలాంటి హీరోయిన్ ఇప్పుడొక మంచి మాట చెబితే.. నెటిజన్లకు ఎక్కడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..
తాజాగా ఆమె సోషల్ మీడియాలో కొబ్బరిబొండాం నీళ్లని స్ట్రా లేకుండా తాగుతున్న ఫొటోని షేర్ చేసింది. ఈ ఫొటో షేర్ చేసిన ఆమె.. నేను ఎప్పుడు నా వెంట స్టీల్ స్ట్రా తెచ్చుకుంటాను. ఒకవేళ అది నా చెంత లేని పక్షంలో.. ఈ విధంగా డైరెక్ట్‌గా తాగేస్తాను తప్పితే.. ప్లాస్టిక్ స్ట్రాని మాత్రం వాడను. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. చిన్న చిన్న పనులు.. పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయని తెలుసుకోండి.. అనేలా పోస్ట్‌లో పేర్కొంది. మరి ఇందులో తప్పేం ఉందో కానీ.. నెటిజన్లు ఆమెకు కౌంటర్స్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల నుండి వ్యక్తమవుతోన్న నెగిటివిటీపై అనన్య అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎందుకింత నెగిటివిటీ.. ప్లాస్టిక్ వాడకం తగ్గించమనే కదా నేను చెప్పింది. దీనిని కూడా కొందరు తప్పుబడుతూ నన్ను విమర్శిస్తున్నారు. నేనొక చిన్న విషయం చెప్పా.. మీకు నచ్చితే పాటించండి.. లేకపోతే లేదు. ఎందుకింత నెగిటివిటీ.. అంటూ ఈ పొట్టేల్ భామ ఫైర్ అయింది.