ప్రేయసి శిరీషా లెల్లా (సిరి)తో నారా రోహిత్ నిశ్చితార్థం పూర్తయింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో నారా రోహిత్-సిరిల నిశ్చితార్థ వేడుక నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటు.. బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి, నారా రోహిత్ పెదనాన్న అయిన నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా, నందమూరి, సిరీ లెల్లా కుటుంబాలకు చెందిన పలువురు హాజరయ్యారు. నారారోహిత్, సిరీ లెల్లాల వివాహం డిసెంబరు 15న గ్రాండ్‌గా జరగనుంది.
నారా రోహిత్ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు వరస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన ప్రతినిధి 2 చిత్రం విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సిరిలెల్లాతో ఆయన ప్రేమాయణం నడిపారు. ఆ ప్రేమని పెద్దల వరకు తీసుకెళ్లి.. ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకెళుతున్నారు. ఇక నిశ్చితార్థ వేడుక అనంతరం నారా రోహిత్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో
నేను సిరితో కలిసి ఎన్నో ఆనందమైన క్షణాలను, సాహసాలను, జ్ఞాపకాలను పంచుకున్నాను. ఇప్పుడు, నా లవ్ సిరితో ప్రేమ, ఆనందంతో నిండిన జీవితాన్ని పంచుకోవడం కోసం, గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.. అని తెలుపుతూ.. సిరితో ఉన్న ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఈ కాబోయే నూతన జంటకు అభిమానులు, నెటిజన్లు, ప్రేక్షకులు, సన్నిహితులు, బంధువులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.