చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచే నేతల్లో మొదటి వరుసలో ఉంటారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి.. నేడు జగన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు.. అంతకు మించి నమ్మినబంటు. అందుకే జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. వైసీపీ ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి అధినేతను ఒంటరి చేసి పదుల సంఖ్యలో నేతలు తిన్నగా సైడ్ అయ్యారు.. మరికొందరు ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. ఐతే.. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఒక్కటే అని చెప్పి చెవిరెడ్డి మాత్రం అన్నా.. అన్నా అంటూ జగన్ వెన్నంటే ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే.. దసరా పండుగ సందర్భంగా చెవిరెడ్డి పెద్ద సాహసమే చేశారు.
అవసరమా రెడ్డీ..!
వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ దసరా పండుగ వచ్చిందంటే చాలు చెవిరెడ్డి గట్టిగానే హడావుడి చేసేవారు. జగన్ చుట్టూ ఉండే కీలక వ్యక్తులు మొదలుకుని క్యాంపు కార్యాలయంలో పనిచేసే మనుషులు, మీడియా ప్రతినిధులు వరకూ ఆకర్షణీయమైన బహుమతులు ఇచ్చేవారు. ఇప్పుడు అధికారమే లేదు గనుక వాటి జోలికి రెడ్డి వెళ్ళరు అనుకున్నారు కానీ.. మునుపటికి మించి ఇప్పుడు ఏకంగా.. ఎవరూ ఊహించని రీతిలో.. భారీగా కానుకలు ఇచ్చారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్ 16ప్రో మొబైల్ ఫోన్లను అందించారని తెలుస్తోంది.
ఎందుకో..!
ఒక్కొక్క ఐఫోన్ ఖరీదు రూ.1.60 లక్షలకు పైమాటే ఉంది. అలాంటిది చెవిరెడ్డి ఇప్పుడు ఇంత హడావుడి చేసి గిఫ్టులుగా ఎందుకు ఇచ్చారు..? అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా.. ఆ ఎన్నికల్లో చెవిరెడ్డి ఏమైనా పోటీ చేస్తున్నారా..? అంటే అదీ లేదు. బహుమతులు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా భాస్కర్ రెడ్డి ఎందుకిలా చేశారు..? అన్నదే ఇప్పుడు వైసీపీలో నడుస్తున్న హాట్ టాపిక్. వాస్తవానికి రాజకీయ నాయకుడు సొంతంగా ఒక్క రూపాయి ఖర్చు పెడుతున్నారంటే.. దాని వెనుక పెద్ద ప్లాన్, లెక్కలే ఉంటాయ్. అలాంటిది ఇప్పుడు చెవిరెడ్డి ఐఫోన్స్ గిఫ్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో చూడాలి మరి.