టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి మర్యాద తక్కువ అయ్యిందా..? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరిగ్గా ట్రీట్ చేయలేదా..? నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నేడు సీఎంగా ఉన్న బాబు.. ఇద్దరిలో ఎవరు సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేశారు..? ఇవన్నీ కాదు నాటికి.. నేటికీ ఉన్న తేడా ఏమిటి..? అసలు ఇప్పుడే ఎందుకు చిరు, చంద్రబాబు అంటూ మీడియా.. సోషల్ మీడియాలో ఇంత చర్చ నడుస్తోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
ఏమిటీ హడావుడి..?
వరదలతో విలవిలలాడిన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి నేనున్నాను అంటూ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చిరు 50 లక్షలు, రామ్ చరణ్ 50 లక్షలు విరాళంగా ప్రకటించగా.. శనివారం నాడు సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి కోటి రూపాయలు చెక్కు అందజేశారు. చిరు వెళ్ళారు.. చెక్ ఇచ్చారు.. తిరిగొచ్చారు ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మొదలైంది వివాదం. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. మెగాభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఐతే చిత్ర విచిత్రంగా మాట్లాడేస్తున్నారు. ఇదిగో మర్యాద ఇవ్వడంలో వైఎస్ జగన్ రెడ్డిని మించిన వారు లేరని వైసీపీ.. అవును అవమానించి పంపింది కూడా మీరే కదా అని టీడీపీ శ్రేణులు, మెగా ఫ్యాన్స్ కొందరు విరుచుకుపడుతున్నారు.
కనీసం లేదే..!
చంద్రబాబును చిరు కలిసినప్పుడు బొకే లేదని.. కనీసం శాలువా కూడా కప్పలేదేం..? అని వైసీపీ హడావుడి చేస్తోంది. ఐతే.. టీడీపీ మాత్రం మరోలా అంటోంది. చిరంజీవికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు.. భేటీ అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారని టీడీపీ చెబుతోంది. ఐతే.. జగన్ మాత్రం ఇంటికి పిలిచి ఫుడ్ పెట్టి, శాలువాలు కప్పి, తిరిగి వెళ్ళేటప్పుడు కారు వరకూ వెళ్లి పంపి వచ్చిన కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు విశ్వాసం లేదని వైసీపీ వీరాభిమానులు గట్టిగానే రచ్చ చేస్తున్నారు. స్వయంగా భారతీనే వడ్డించారన్న విషయాన్ని కూడా వైసీపీ కార్యకర్తలు కొందరు గుర్తు చేస్తున్నారు. ఐతే.. కోటి రూపాయిలు విరాళంగా.. ఇంటికి వచ్చిన మనిషికి బాబు కనీసం శాలువా కూడా కప్పకపోవడం ఏంటి..? ఆయన మెగాస్టార్.. పైగా డిప్యూటీ సీఎం సోదరుడు కదా..? అన్నది ఇప్పుడు మెగాభిమానులు కొందరు నోట వస్తున్న ప్రశ్న. ఈ వ్యవహారంపై సనాతన ధర్మ పరిరక్షకుడు, కాపు సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు ఏమంటారు..? అని వైసీపీ ప్రశ్నలు సంధిస్తోంది.
ఇంత రచ్చ అవసరమా..?
నాడు చిరును జగన్ ఎలా ట్రీట్ చేశారు..? నేడు చంద్రబాబు ఎలా ట్రీట్ చేశారు..? అని తేడాలు చూపించి మరీ అటు వైసీపీ.. ఇటు టీడీపీ శ్రేణులు కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మొదటిసారి రాచ మర్యాదలు చేసిన జగన్.. రెండోసారి ఇండస్ట్రీ పెద్దలు అందరి ముందూ దండం పెట్టించుకున్న సందర్భం మాకూ గుర్తు ఉందని టీడీపీ కార్యకర్తలు, మెగాభిమానులు కొందరు చెబుతున్నారు. ఐతే.. నమస్కారం చేసినప్పుడు జగన్ ప్రతి నమస్కారం చేయలేదని.. ఇదిగో చంద్రబాబు మాత్రం నమస్కరించి కారు దాకా వెళ్లి బై చెప్పేసి వచ్చారని ఇదీ బాబు అంటే అని టీడీపీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటున్నారు. చిరు - జగన్.. చిరు - చంద్రబాబు కలిసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చూశారుగా.. ఇదీ చిరు విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య నడుస్తున్న చర్చ.. అంతకు మించి రచ్చ. ఇదిగో ఇక మీరే చెప్పండి ఎవరు చిరుకు మర్యాద ఇచ్చారు..? ఎవరు అమర్యాదగా ప్రవర్తించారు..? అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.