గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా విడుదలకు సంబంధించి శనివారం ఒక మేజర్ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతికి, అదీ కూడా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర స్లాట్‌లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విశ్వంభర టీమ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విశ్వంభర టీజర్ లాంచ్ వేడుకలో దర్శకుడు వశిష్ఠ.. గేమ్ చేంజర్ కోసం విశ్వంభరను వాయిదా వేశామని తెలియజేశారు. మొత్తంగా అయితే విశ్వంభర వాయిదా.. గేమ్ చేంజర్ సంక్రాంతికి అనేది క్లారిటీ వచ్చేసింది.
తాజాగా గేమ్ చేంజర్ మేకర్స్ విడుదల తేదీతో అఫీషియల్‌గా పోస్టర్‌ను వదిలారు. 10 జనవరి, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఈ పోస్టర్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యమా జోష్‌లో కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను వాస్తవానికి డిసెంబర్‌లో క్రిస్మస్‌కి విడుదల చేయాలని చూశారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది.
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు.