అవును.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పవర్ చేతిలోకి వస్తే ఎలా ఉంటుందనేది కేవలం మూడంటే మూడు నెలల్లోనే చేసి చూపించారు..! ఎందుకు ఈ మాట అనాల్సివస్తోంది అంటే. పవన్ చేతికి పంచాయతీ రాజ్ శాఖ వచ్చాక పల్లె స్వరూపం క్రమంగా మారుతోంది. ఇప్పటివరకూ ఉన్న ప్రభుత్వాలు, ఈ శాఖకు మంత్రిగా ఉన్నవాళ్లు పల్లెలను ఏ మాత్రం పట్టించుకున్నారో మన అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆ శాఖ సేనాని చేతిలోకి వచ్చాక.. వెలవెల బోయిన పల్లెలు.. ఇప్పుడిప్పుడే కళకళలాడుతున్నాయి.. ఇంకొన్ని చోట్ల త్వరలోనే పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
నాడు.. నేడు..!
నాడు.. నేడు అనగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నారు కదూ కానీ ఇక్కడ పరిస్థితులు వేరులెండి. ఒకప్పుడు పల్లెలు ఎలా ఉన్నాయ్.. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉండాలి..? మరీ ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ మన చేతిలోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉంది..? అనేది యావత్ ప్రపంచానికి తెలియాలని.. రేపటి రోజున అదిగో పలానా వ్యక్తి ఇలా చేశారు అని చెప్పుకునేలా పల్లెల రూపు రేఖలు మార్చడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉంది..? అని ప్రజలు చెప్పుకునేలా ఉండాలట. వాస్తవానికి.. గతంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు.. అలాగని ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేదా అంటే అదీ లేదు. నిధులన్నీ పక్కదారి పట్టించి.. సంక్షేమ పథకాల కోసం వినియోగించినట్టు ప్రభుత్వం చెప్పేది. దీంతో పంచాయతీలు దీనావస్థలో ఉండేవి.
స్పెషల్ ఫోకస్..
గతంలో లాగా ఉండకూడదు అని గ్రామాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఏకకాలంలో 13 వేలకు పైగా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ప్రజాపయోగ పనులను గుర్తించి పరిష్కార మార్గాలు చూపిస్తూ ముందుకెళ్తోంది పవన్ అండ్ కో. వాస్తవానికి.. మునుపు ఎన్నడూ ఎక్కడా పెద్దగా గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఐతే పవన్ తన మార్క్ చూపించటానికి గ్రామ సభలు నిర్వించడం.. అది కాస్త ప్రపంచ రికార్డును నమోదు చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఇక పల్లెల్లో ఏమేం పనులు చేయాలి..? ఏ ఊరిలో ఏమేం అవసరాలు ఉన్నాయ్..? అని ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుని మరీ పవన్ స్వయంగా రంగంలోకి దిగిపోయారు.
పల్లె మారాలి..!
అక్టోబర్ - 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం ప్లాన్ చేసారు. అందుకే.. ఈ నెల 20 లోపు పల్లెల్లో గుర్తించిన పనులు ప్రారంభించాలని.. సంక్రాంతి పండుగ లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను పవన్ ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో 13 వేలకు పైగా పంచాయతీలు ఉండగా.. గ్రామ సభల ద్వారా సుమారు 30 వేల వరకు పనులను గుర్తించడం జరిగింది. ఇందుకోసం.. రూ.4500 కోట్లు నిధులు మంజూరు చేయడానికి సర్వం సిద్ధం అయ్యింది. మరోవైపు.. 26715 పనులను గాను రూ.2239 కోట్లు ఇవ్వడానికి అన్ని అనుమతులు వచ్చాయి. ఈ మొత్తం పనుల్లో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా చూడాలని మరీ మరీ అధికారులను ఆదేశించడం విశేషం.
ఎటు చూసినా.. ఎవరి నోట విన్నా..!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది.. కనిపిస్తోంది. ఎందుకంటే తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, కీలక శాఖలను దక్కించుకోవడం, ఆ శాఖలకు వన్నె తెచ్చేలా పని చేస్తూ వస్తుండటంతో కేబినెట్ మొత్తంలో ప.. వన్ ఒక్కడే సూపర్ అని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం చెబుతున్నారు. దీంతో మిగిలిన మంత్రులు, అనుభవం ఉన్నోళ్ళు ఏం చేస్తున్నట్లు..? గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పవన్.. పవన్.. డిప్యూటీ.. డిప్యూటీ.. డిప్యూటీ సీఎం అనే మాటలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. పవన్ ఆన్ డ్యూటీలో ఆ రేంజిలో దూసుకెళ్తున్నారు గనుక అందరి నోట ఇలా నానుతున్నారు.
ఆది నుంచి అంతే..!
వాస్తవానికి శాఖ తన చేతిలోకి వచ్చినప్పుడు నుంచి పవన్ దూకుడు ప్రదర్శిస్తున్నది నిజమే. మొదట్లో గంటల తరబడి అభివృద్ధిపై రివ్యూలు చేయడం, గ్రామ సభలు నిర్వహణ.. రికార్డు సృష్టించడం.. రిపబ్లిక్ డేకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం.. వరదల సమయంలో బాధితులకు సహాయం కోసం 2 కోట్లు, 400 పంచాయతీలకు ఒక్కో దానికి లక్ష చొప్పున మొత్తం 4 కోట్లు కేటాయించడం.. ఇప్పుడు గ్రామాల్లో రోడ్లు, వాటర్ స్కీమ్స్, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు ఇలా గ్రామాల రూపు రేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్నారు పవన్. మరీ ముఖ్యంగా.. ఏపీలో ఏం జరిగినా శరవేగంగా స్పందించేది కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇందుకు తిరుమల లడ్డూ వ్యవహారమే చక్కటి ఉదాహరణ. సీఎం చంద్రబాబు అలా ఆరోపణలు చేసి లైట్ తీసుకుంటే.. నెత్తిన వేసుకుని హిందువులను ఏకం చేయడం డిప్యూటీతోనే సాధ్యం అయ్యింది. ఆఖరికి సనాతన ధర్మం అంటూ బరిలోకి దిగి ధర్మాన్ని పరిరక్షించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఇవి కూడా చూడండి..!
విశాఖ ఉక్కుపై నాడు ప్రగల్భాలు పలికిన పవన్ నేడు ఎందుకో బేల మాటలు మాట్లాడుతున్నారు. ఎంతవరకైనా వెళ్లి పోరాడతామని నాడు చంద్రబాబు, పవన్ శపథాలు చేసి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేవలం ఆమడ దూరంలోనే ఉంది.. ఈ సంగతి చూస్తే మంచిది. ఎందుకంటే రాష్ట్రంలో మీరు.. కేంద్రంలో మీకు కావలసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు గనుక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఇచ్చిన మాటను సేనాని గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా అప్పట్లో 30 వేలమంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పిన మీరు వారిని తిరిగి తీసుకొచ్చి ఆయా కుటుంబాల్లో ఆనందం నింపాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఆడబిడ్డల రక్షణపై ప్రత్యేక చర్యలకు మీ నుంచి పునాది పడాలి. ఒకప్పుడు మీరు చెప్పిన సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ..? అనే ప్రశ్న ప్రత్యర్థులు, విమర్శకులు నుంచి రాకుండా చూసుకోవాల్సిన అవసరం డిప్యూటీ పైనే ఉంది. అలాగే జనసేనలోకి ఇతర పార్టీల నుంచి వచ్చే వారికంటే.. పార్టీలోని ఉడుకు రక్తంకు ఛాన్స్ ఇవ్వండి.. కార్యకర్తలను నేతలుగా మార్చండి. చూశారుగా.. పవన్ కళ్యాణ్ చేతికి పవర్ వచ్చాక చేసిన చేస్తున్న పనులు.. మిగిలిపోయిన పనులు..! మున్ముందు ఇంకా మరెన్నో మంచి పనులు చేసి మీ మార్క్ మరింత చూపించుకోవాలని ఆశిస్తూ.. Cinejosh.Com తరపున ఆల్ ది బెస్ట్ డిప్యూటీ సీఎం సార్.