ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబుకు మునుపెన్నడూ లేని విధంగా రెండు విషయాల్లో కావాల్సినంత చెడ్డ పేరు వచ్చేసింది..! బహుశా.. సీబీఎన్ రాజకీయ జీవితంలో ఈ టర్మ్ సీఎంగా చేయడంలో ఆది నుంచి అన్నీ అడ్డంకులు, కష్టాలే ఎదురవుతున్నాయి. తన విజనరీ, రాజకీయ చాణక్యత ఏమైంది..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతుంటే వైసీపీ ఊరుకుంటుందా ఇదే సువర్ణావకాశం అని రంగంలోకి దిగిపోయింది. ఏపీలో భారీ దోపిడీకి టీడీపీ కూటమి తెర లేపిందని లెక్కలు తీసి మరీ చెబుతోంది వైసీపీ.
ఇదీ అసలు సంగతి..!
ఆ రెండు విషయాలు మరేవో కాదండోయ్.. ఒకటి మద్యం, మరొకటి ఉచిత ఇసుక. ఈ రెండు విషయాల్లో చంద్రబాబు సర్కార్ ఏం చేస్తోందో కూడా అర్థం కావడం లేదు. అప్పుడెప్పుడో ఉచిత ఇసుక అని హడావుడి మొదలుపెట్టిన సర్కార్.. ఇంత వరకూ అది కొలిక్కే రావడం లేదు. దీనికి తోడు రోజూ ఏదో ఒక రాద్దాంతం నడుస్తూనే ఉంది. ఇక మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి టీడీపీ తెర లేపిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు.. ముఖ్య నేతల కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట వేస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని వ్యాపారుల నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి.
ఇంత అతి ఎందుకో..?
99 రూపాయలకే నాణ్యమైన మద్యం అన్నారు సరే..
మద్యం దుకాణాల లైసెన్సుకు దరఖాస్తులు చేసుకోవడానికి వ్యాపారులు వణికిపోతున్న వైనాన్ని ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. మర్యాదగా వదిలేయండి.. లేదా మాకు వాటా ఇవ్వండి అంటూ వ్యాపారులను కూటమి పార్టీల ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎవరో ఒక్కరు.. ఎక్కడో ఒక్క చోట అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుదు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం అని టీడీపీ అనుకూల దినపత్రికలు, టీవీ ఛానెళ్ళలో ప్రధాన సంచికలుగా కథనాలు రావడం గమనార్హం. ఎమ్మెల్యేలు చేస్తున్న అతితో ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. మా మాట కాదని.. దరఖాస్తులు చేస్తే తాట తీస్తామని స్వయంగా ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. దీంతో భయపడి తటస్టులు, వ్యాపారులు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నట్టు..? ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతుందని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి..?. సీఎం దృష్టికి ఎమ్మెల్యేల వ్యవహారాలు వెళ్ళాయా..? లేదా.. ఒకవేళ వెళ్లి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అన్నది తెలియట్లేదు.
అవసరమా..!?
ఎమ్మెల్యేలు చేస్తున్న అతిని కొందరు టీడీపీ కార్యకర్తలు సమృతిస్తున్నారు. ఎలాగంటే.. ఎమ్మెల్యేలు ఇలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు.. మరి ఎన్నికలకు ఖర్చుపెట్టిన కోట్ల డబ్బులు ఎలా వస్తాయ్.. అవినీతి చెయ్యడం కన్నా ఇది చాలా మంచి దారి అని సిగ్గు ఎగ్గు లేకుండా చెబుతుండటం ఎంత వరకూ సమంజసం. సొంత రాష్ట్రం వారికి 50 లక్షల రూపాయలు పెట్టి వ్యాపారం చేసుకునే ధైర్యం లేకపోతే వందల కోట్లు పెట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడి ఎలా పెడతారు..? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోంది..? అన్నది ఎవరికి అర్ధం కావడంలేదు. 2023 ఆగస్టులో తెలంగాణలో 2620 మద్యం షాపులకు టెండర్లకు పిలిస్తే 1 లక్షా 25 వేల పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు 2 లక్షలు.. ఇదంతా తిరిగి ఇవ్వడానికి లేదు.. తద్వారా సర్కారుకు వచ్చిన ఆదాయం రూ. 2500 కోట్లు. ఐతే.. ఆంధ్రాలో 961 మద్యం షాపులకు ఇప్పటి వరకూ కనీసం ఒక్కటంటే ఒక్కటీ దరఖాస్తు రాలేదు. ఐతే.. ఇప్పటికి 3396 షాపుల కోసం 8274 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అంటే.. తెలంగాణతో పోల్చితే దరఖాస్తు ఫీజు 3000 కోట్లు రావాలి.. పరిస్థితులు చూస్తుంటే.. 500 కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీనంతటికీ కారణం.. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల బెదిరింపులే.
ఇసుక మరింత ప్రియం!
ఉచిత ఇసుక అన్నారు.. కానీ ఇది మాటలకే పరిమితం అయ్యింది ఆచరణలోకి రాలేదు. దీంతో సామాన్యుడు వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 475 రూపాయలకే అమ్మిన టన్ను కంటే ఉచిత ఇసుక ఇవాళ అనేక ప్రాంతాలలో ఎక్కువ రేటు పలుకుతున్న పరిస్థితి. 20 టన్నుల ఇసుకకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అక్కర్లేదు.. కానీ .. ఇసుక రవాణా ఛార్జీలు 9,276.19 రూపాయలు అవుతున్నాయి. కానీ రూ. 16,640.00 చెల్లించాల్సి వస్తోంది. అంటే టన్నుకు రూ. 832 పడిందన్న మాట. దీంతో.. నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో.. ఉచిత ఇసుకలో ఉచితం అనేది కూడా అంతే నిజం అని జనాలకు బాగా అర్థం ఐపోయింది. ఇసుక వ్యవహారంలో నెలకొన్న పరిణామాలతో ఉచిత ఇసుక.. ధరల మర క అని అనక తప్పదు మరి. ఇసుక ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశం ఉత్తమమైనదే కానీ ఆచరణలోనే ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
సీఎం ఏం చేస్తున్నారో..!?
ఇసుక ఉచితమే అయినా, రవాణా, నిర్వహణ చార్జీల వసూలు విషయంలో ఏకరూపత లేకపోవడంతో సామాన్యుడు నానా తిప్పలు పడుతున్న పరిస్థితి. ఈ ఉచితం అమలులో తక్షణమే లోపాల దిద్దుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ చంద్రబా ఎందుకు మౌనం పాటిస్తున్నారు..? ఇక మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియలోనూ ఎమ్మెల్యేలు ఇంతలా జోక్యం చేసుకుంటూ ఉంటే సీఎం ఇంకా నోరు మెదపకుండా ఉన్నారో ఏంటో అర్థం కావడం లేదు. ఈ రెండు విషయాల్లో కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు ఐతే వచ్చేసింది. ఇంత జరుగుతున్నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏమైనట్టు..? సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అన్న ఆయన.. మద్యం షాపుల టెండర్లలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి ఎమ్మెల్యేలు గండి కొడుతుంటే ఎందుకు చూస్తూ మిన్నకుండిపోయారు..? అనేది చంద్రబాబుకే తెలియాలి. బహుశా.. ఇలా చేస్తే ఐనా.. మద్యం షాపులు సొంత ప్రైవేటు వాళ్ళకే ఇచ్చుకోవచ్చని ఏమైనా సీఎం ప్లాన్ చేస్తున్నారో ఏమో మరి. ఇకనైనా ఈ రెండు విషయాల్లో స్వయంగా సీఎం కలుగజేసుకుని తగు పరిష్కార మార్గం చూపిస్తే మంచిది.. లేని పక్షంలో ఇదంతా రానున్న ఎన్నికల్లో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.