అవును.. ఇప్పుడు డిప్యూటీ సీఎం Vs డిప్యూటీ సీఎం డిష్యుం డిష్యుం నడుస్తోంది..! ఎప్పుడు ఎవరు ఫైర్ అవుతారో తెలియట్లేదు. ఆ ఫైర్ కాస్త బ్లాస్ట్ అయితే మాత్రం పెద్ద విపత్తు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరు డిప్యూటీలు మరెవరో కాదండోయ్.. ఇందులో ఒకరు ఆంధ్రపదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాగా.. మరొకరు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి.
ఎందుకు.. ఏమైంది..?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంతో మొదలై ఇప్పుడు పవన్ - ఉదయనిధి మధ్య రోజు రోజుకూ పెచ్చు మీరుతోంది. సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అంటూ నాడు స్టాలిన్ కుమారుడు చేసిన మాటలను గుర్తు చేసుకుని మ6రీ తిరుపతి వారాహి డిక్లరేషన్ వేదికగా పరోక్షంగా గట్టిగా ఇచ్చి పడేశారు. దీంతో తమిళనాడు మీడియా, మీమ్స్ పేజీలు, యూట్యూబర్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పవన్ పై ఒక్కటే వ్యక్తిగత విమర్శలు, అనరాని మాటలు అన్నారు.. అంటూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఐతే బాబోయ్ కొన్ని ట్విట్టర్ పేజీలు సేనానిని చిత్ర విచిత్రంగా వ్యక్తీకరిస్తూ ఆడుకుంటున్నాయి. అంతే కాదు మధురైలో పవన్ పై వాంజినాధన్ అనే లాయర్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉదయనిధి స్పందిస్తూ జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ జవాబిచ్చారు. దీంతో ఈ మాటలన్నీ చూస్తున్న వైసీపీ సోషల్ మీడియా మురిసిపోయి పవన్ కళ్యాణ్ పై మరింత విరుచుకుపడుతోంది.
ఎఐడీఎంకే గురుంచి ఎందుకో..?
ఇవన్నీ ఒక ఎత్తయితే.. డీఎంకేను దెబ్బకొట్టడానికి ఎఐడీఎంకే పార్టీని ఈ మధ్య పవన్ ఆకాశానికి ఎత్తుతున్నట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే.. ఎంజీఆర్ గురుంచి, ఆ పార్టీ గురుంచి ఈ మధ్య వరుస ట్వీట్లు చేస్తూ వస్తుండటం గమనార్హం. దీంతో డీఎంకే మరింత రెచ్చిపోతోంది. గత ఎన్నికల్లో డీఎంకే - కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా.. అన్నాడీఎంకే - బీజేపీ కలిసి పోటీ చేసినా కాషాయ పార్టీ కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. అన్నామలై తమిళనాట బీజేపీ వ్యవరహాలు చూస్తున్నారు. ఐతే.. పవన్ కూడా ఇక్కడ ఈ రెండు పార్టీలకు మద్దతుగా నిలిచే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. సౌత్ మొత్తం.. (ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక) ఎన్డీఏ అధ్యక్ష బాధ్యతలు, లేదా కన్వీనర్ పదవి పవన్ కు కట్టబెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ డైరెక్షనులోనే పవన్ ఇలా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
దళపతి ఇదే గోల్డెన్ ఛాన్స్!
వాస్తవానికి.. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం చేకూరుతుంది అనే మాట మనం వింటూ ఉంటాం కదా.. ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. తమిళనాడులో ఉండే మెగాభిమానులు, పవన్ ఫ్యాన్స్, అక్కడున్న సనాతన ధర్మ పరిరక్షకులు, హిందువులను తనవైపు తిప్పుకునేందుకు దళపతికి ఇదొక సువర్ణావకాశం అని విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగంను బలపరుచుకోవడానికి ఇవన్నీ తోడ్పడవచ్చు. ఎలాగో ఇప్పుడు అన్నాడీఎంకేలో నాయకత్వ లోపం ఉంది.. ఇక బీజేపీ ఐతే జీరో. ఉన్నదల్లా ఒకే ఒక్క డీఎంకే మాత్రమే. ఇక విజయ్ ఢీ కొనడానికి.. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, శత్రువులను తనవైపు తిప్పుకున్నారో ఇప్పుడు బలమైన పార్టీగా చేసుకొని.. రేపు పొద్దున్న అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ అవకాశాన్ని విజయ్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో మరి. చూశారుగా.. పవన్ మాట్లాడిన ఒకే ఒక్క మాట.. ఎటు నుంచి ఎటు పోయిందో.. ఎవరికి లాభం చేకూరబోతోందో..! ఇదీ డిప్యూటీ Vs డిప్యూటీ కథ.