జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకిలా తయారయ్యారు? అసలు ఎటు నుంచి ఎటు పోతున్నారు? జనసేన పార్టీ ఆవిర్భావం ఎలా అయ్యింది? ఏ సిద్ధాంతాలు, విధి విధానాలతో అయ్యింది? 2014 ఎన్నికల్లో ఎలా ఉండేది? 2019 ఎన్నికల్లో ఎక్కడికి వచ్చింది? 2024 ఎన్నికల్లో కూటమి కట్టి గెలిచిన 4 నెలల్లోనే పార్టీ ఎందుకిలా మారింది? పవన్ ఎందుకిలా మారిపోయారు? అసలేం జరుగుతోంది? 2029 ఎన్నికల్లో ఏం జరగబోతోంది? అనే ఆసక్తికరమైన ఎన్నో విషయాలు, అంతకు మించి ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం రండి.
ఏం జరుగుతోంది?
పవన్ రాజకీయ ప్రవేశం మొదలుకుని ఇప్పటి వరకూ ఎన్నో ఒడిదుడుకులు చూశారు. పార్టీ స్థాపించి పదేళ్లయినా సక్సెస్ కాలేకపోయిన పవన్ 2024 ఎన్నికల్లో రియల్ హీరో అనిపించుకుని.. పవర్ స్టార్ అంటే ఏంటో పవర్ లోకి వచ్చి చూపించారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. ఆయన జర్నీలో ఎవరితో కలిసి ముందుకు అడుగులు వేసినా పట్టుమని కొన్ని రోజులు కూడా ఉండలేని పరిస్థితి. తొలుత సీపీఐతో పయనించి విప్లవం అంటూ కొద్దిరోజులకే ఉసూరుమనిపించారు. ఆ తర్వాత సీపీఎం అన్నారు.. ఆ పార్టీని కూడా వదిలేసి ఏకంగా బహుజన సమాజ్ వాదీ పార్టీ అని.. అధినేత్రి మాయావతి కాళ్ళు మొక్కి ముచ్చటగా మూడో పార్టీని వదిలేసిన పరిస్థితి. వీటన్నిటికీ ముందు చేగువేరా, పెరియార్, కాన్షిరాం, సుందరయ్య, టి. నాగిరెడ్డి ఇలా అన్ని పేర్లు చెప్పి ఆ సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతాలు అని చెప్పి ఆకరికి అన్నీ వదిలేసి.. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడంలో కీలక పాత్ర పోషించారు.
2019- 2029లో పరిస్థితి ఏంటి?
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. అదికూడా అధినేత రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచి నిలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో తిన్నగా ఎర్ర కండువా తీసేసి ఫ్యాన్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక మళ్ళీ 2024 ఎన్నికలకు సరిగ్గా పదేళ్ళ కిందటి కూటమి టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసి గెలిచింది.. పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. రానున్న 2029 ఎన్నికల్లో పవన్ పరిస్థితి ఏంటి..? అసలు టీడీపీతో కలిసి జర్నీ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఇసుమంత కూడా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే డ్యామేజీ.. కష్టమే!
వాస్తవానికి.. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి క్రిస్టియన్లు, ముస్లిం సామాజిక వర్గాలు చాలా వరకూ సాయంగానే ఉన్నాయ్. అలాంటిది పవన్ ఇప్పుడులాగే రేపు కూడా హిందూ, సనాతన అంటే ఈ రెండు వర్గాలు తప్పకుండా వ్యతిరేకం అవుతాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా అక్షరాలా నిజమే. ఎలాగంటే.. ఎంతసేపూ ఒక మతాన్ని ఎక్కువ చేసి మాట్లాడితే అవతలి మతస్తులకు కచ్చితంగా మండుతుంది.. వ్యతిరేకం అవ్వడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఒంటరిగా ఐనా వెళ్ళడానికి సిద్ధ పడుతుంది కానీ జనసేన కలిసి పయనం కుదరకపోవచ్చు. ఇప్పటికే టీడీపీ మీద కొన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందట. అసలు ఇంత రచ్చ చేస్తున్న పవన్.. మనకు అవసరమా..? అనే ప్రశ్న టీడీపీ కార్యకర్తలు, నేతల నుంచి సీఎం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టే సమాచారం అందుతోంది.
అయ్యే పనేనా..?
ఐతే ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు పవన్ వేరు. ఇది వరకూ కులాలు, మతాలు, ప్రాంతాలు అంటే పెద్దగా పట్టించుకోని ఆయన సనాతన ధర్మం అంటూ గట్టిగానే హడావుడి చేస్తున్నారు. రేపొద్దున ఇప్పటి వరకూ ఎన్నో పార్టీలు, మరెంతో మంది ఆదర్శకులను వదిలేసిన పవన్ కళ్యాణ్.. రేపు సనాతన ధర్మాన్ని కూడా పక్కన పెట్టరని నమ్మకం ఏంటి..? లేదు ఈసారి మాటంటే మాటే అంటారా..? ఈయనకు సహకరించేది ఒక్క బీజేపీ తప్ప మరో పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. అప్పుడిక బీజేపీ, జనసేన మాత్రమే కలిసి రానున్న ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. పోనీ ఈ రెండు పార్టీలతో ఒరిగేదేమీ ఉండదు. బహుశా రెండు పార్టీలు కలిసినా తిప్పికొడితే అడ్రస్ ఉండవేమో. ఈ పరిస్థితుల్లో ఇక ఏం జరుగుతుందో తెలుసు కదా. డిప్యూటీ సీఎంను పావుగా వాడుకొని బీజేపీ ఏమైనా ఇలా మతం, ధర్మం అంటూ రెచ్చగొట్టేలా చేస్తోందా..? అంటూ అభిమానులు, కార్యకర్తలో ఆందోళన సైతం మొదలైంది.
అప్పుడు.. ఇప్పుడు..!
ఎన్నికల ముందు.. నా భార్య, కూతురు క్రిస్టియన్ అబ్బా నేను కూడా బాప్టిస్ట్ అని కూడా చెప్పిన పవన్.. ఎన్నికల తర్వాత ఐ యాం అనపాలజెటిక్ హిందూ అని హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే రోజుల వ్యవధిలోనే వేషం మారింది.. భాష మారింది పూర్తిగా మనిషే మారిపోయారు. ఇది.. మత రాజకీయం కాక మరేమిటీ? ఇదే ఇప్పుడు సేనానికి కొన్ని వర్గాలు దూరం అయ్యే పరిస్థితిని కల్పిస్తోందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు ఏమో. అప్పుడు అలా ఉన్న ఇప్పుడు ఇలా అన్నారు.. రేపు ఇంకెలా ఉంటారో..? ఒక సనాతన ధర్మం అంటూ ఇంకేం చేస్తారో..? అనేది ఇప్పుడు పార్టీని గెలిపించిన కార్యకర్తలకు దిక్కు తోచని పరిస్థితి.
ఇందుకేనా గెలిపించింది..?
అయ్యా.. పవన్ కళ్యాణ్ తమరికి ఓటేసి గెలిపించిన ఓటర్లకు ఇంత వరకూ చేసిందేంటి..? అనేది ఒక్క ఒకసారి ఆలోచించండి. ఏపీ యువత అంతా కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఎన్నో కలలు కన్నారు. దీనికి తోడు.. పదుల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కదా..? అలాంటిది ఎన్నో ఆశలతో ఓట్లు వేస్తే.. గెలిచాక కాషాయం ధరించి, సనాతన ధర్మం, హిందూ వాదం, వేమనగీతం అంటూ ఇలా ఎందుకు మారిపోయారు..? అనేది అభిమానులు, నేతలు, కార్యకర్తలకు అస్సలు అర్థం కాని పరిస్థితి. ఇక రానున్న నాలుగేళ్ల పాటు ఇలాగే కాషాయం దుస్తులు ధరించి, ఇలాగే ఉంటారా..? అసలు ఆంధ్ర ప్రజలకు ఇప్పుడు ఇదేనా కావాలి..? ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో పూర్తి కావాల్సిన సాగునీటి ప్రాజెక్టు ఇటువంటి విషయాలపై పవన్ ఎందుకు మాట్లాడరు..? అనేది అతి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న.
నోరు మెదపరేం..?
ఇప్పటి వరకూ ఉన్న ఎన్నో ప్రభుత్వాలు చూసిన ఏపీ యువత.. చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇదే ప్రజల్లో ఎన్నో కులాలు, మతాల వారు కూడా ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఒకే మతం, సనాతన ధర్మం..? అని చెప్పడం ఏంటి..? ఇవన్నీ కాదు.. సభ్య సమాజానికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు..? పోనీ అప్పట్లో పవన్ ఆహా ఓహో అని చెప్పిన, మిస్సింగ్ అయిన 30 వేల మంది అమ్మాయిల సంగతి ఏంటి..? సుగాలి ప్రీతి కేసు ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ ఎంత వరకూ వచ్చింది? రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి..? సంక్షేమ పథకాలు ఎంత వరకూ వచ్చాయి..? ఇలా ఎన్నో విషయాలపై పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు..? అమలు చేసేలా ఎందుకు. గట్టిగా డిప్యూటీ సీఎం ఎందుకు డిమాండ్ చేయట్లేదు..? ఈ విషయాలపై నోరు మెదపని పవన్.. ఇప్పుడు మాత్రం ఎందుకు మతం, హిందూ, సనాతన ధర్మం కోసం మాత్రమే ఆవేశంలో మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు.
ఆశలు సమాధి చేస్తారా?
మీపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు, అభిమానులు, కూటమి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పుడు వారి ఆశలు అడియాశలు అయినట్లేనా..? ఇక మీపై ప్రజలకు ఏ మాత్రం నమ్మకం ఉంటుంది..? అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇన్ని మాటలు, సిద్ధాంతాలు, వ్యక్తులు, పార్టీలను వదిలేసిన వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారు..? టక్కున మాకు నమ్మకం లేదు దొరా..? అని అనకుండా ఉంటారా..? అస్సలు ఉండనే ఉండరు కదా. ఐనా ప్రజలు ఎంత తెలివిగా ఉంటారో 2014 నుంచి 2019 వరకూ బాగానే తెలుసుకున్నారు పవన్. అలాంటిది రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం ఎలా ఉంటారో.. ఇంకెన్ని మార్పులు చేర్పులు చేసుకుని జనాల్లో అభాసుపాలవుతారో.. ఆఖరికి సనాతన ధర్మ పరిరక్షకుడిగా మాత్రమే మిగిలిపోతారో చూడాలి మరి.