జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మిన బంటులకు పెద్ద పీట వేయాలని భావిస్తున్నారా..? తన నమ్మకస్తులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నారా..? అసలు సిసలైన రాజకీయం ఇప్పుడే సేనాని మొదలుపెట్టారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఇంతకీ నమ్మినబంటులకు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు..? అంత నమ్మకస్తులు ఎవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
ఇప్పుడే మొదలు..!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది.. కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల లడ్డూ విషయంలో ఈయన రియాక్ట్ అయినట్లు సీఎం చంద్రబాబు కూడా స్పందించలేదు. సీరియస్ పాలిటిక్స్ చేస్తూ గట్టిగానే ప్లాన్ చేస్తూ వెళ్తున్నారు. ఒకవైపు తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తూ.. మరోవైపు సనాతన ధర్మం.. ఇంకోవైపు పార్టీ కార్యకర్తలు, నమ్మకస్తులకు పదవులు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడిప్పుడే పవన్ అసలు సిసలైన రాజకీయం మొదలు పెట్టారనే చర్చ పార్టీలో నడుస్తోంది.
ఎవరా నమ్మకస్తులు!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ తిరుమల లడ్డూపై పెద్ద చర్చ నడుస్తోంది. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ మెంబర్లుగా తన మనుషులను కూడా పెట్టాలని పవన్ భావిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిలను బోర్డు సభ్యులుగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరి పేర్లు సీల్డ్ కవరులో సీఎంకు పంపడం కూడా అయ్యిందట. పంపకాల్లో భాగంగా జనసేన పార్టీకి టీటీడీలో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలని కోరగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకే తనను నమ్ముకొని ఉన్న త్రివిక్రమ్, ఆనంద్ సాయిల పేర్లు ఫిక్స్ చేశారట. పవన్ ఏ పని చేయాలన్నా.. ఈ ఇద్దరూ ముందు ఉంటారన్నది జగమెరిగిన సత్యమే.
ఇంకా ఎవరెవరు..?.
వాస్తవానికి.. టాలీవుడ్ నుంచి టీటీడీలో సభ్యులుగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్లు సభ్యులుగా, ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్‌లుగా పదవులు పొందారు. జనసేన తరపున ఇద్దరు ఉండగా.. టీటీడీ తరపున నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ రాఘవేంద్రరావు టీటీడీ మెంబర్ల రేసులో ఉన్నట్టుగా సమాచారం. ఐతే మెగా బ్రదర్ నాగబాబు పేరు కూడా వినిపిస్తోంది కానీ ఆయనను రాజ్యసభకు పంపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. త్వరలో నామినేటెడ్ పదవుల ప్రకటన ఉంటుందట. టీటీడీ చైర్మన్ విషయంలోనే కాస్త అటు ఇటు అవుతోందట. అందుకే.. టీటీడీ పదవులు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తోంది. చూశారుగా.. ఇదీ టీటీడీకి సంబంధించి తాజాగా వస్తున్న వార్తలు.. ఇవన్నీ ఎంత వరకూ నిజం అవుతాయో చూడాలి మరి.