నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె గాయత్రి ఛాతీ నొప్పితో హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్ వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించగా.. చిరంజీవి, వెంకటేష్, త్రివిక్రమ్, అల్లు అర్జున్ వంటి వారంతా గాయత్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించి.. రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించి.. ధైర్యం చెప్పారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ బిడ్డ గాయత్రి కాలం చెందటం మనస్తాపానికి గురిచేసింది. ఉదయాన్నే వినకూడని మాట విన్నాను. చిన్న వయస్సులోనే బిడ్డ చనిపోవడం ఎంతో బాధాకరం. నా మిత్రుడు ఈ బాధను ఎలా దిగమింగుకుంటాడు.. ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి అంటూ బయలుదేరాను. తనకున్న బాధను దిగమింగుకొని తన వ్యక్తిత్వంతో భగవంతుడు చాలా పరీక్షలు పెడుతుంటాడు.. అన్నింటిని తీసుకోగలగాలి.. అని వేదాంతిలా మాట్లాడుతుంటే నాకు మరింత బాధ అనిపించింది. అసలతనని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్లు ఏమైపోతారో అని చిన్నవాళ్లు ఆలోచిస్తుంటారు. కానీ సగం జీవితం కూడా చూడకుండా చిన్నవాళ్లు ఇలా కనుమరుగైతే పెద్దలకు తట్టుకోలేని బాధ ఉంటుంది. నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ ఈ విషాదం నుంచి కోలుకుని త్వరలో మళ్లీ అందరినీ నవ్వించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు.