వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..! ఓటమి నుంచి గుణ పాఠాలు ఇప్పుడిపుడే నేర్చుకుంటున్నట్లుగా అర్థం అవుతోంది..! జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారనే మాటలు క్యాడర్ నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ముందు జగన్ కాదని మనం చూస్తున్నది మారిన జగన్ అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇంతకీ ఆయన నిజంగానే మరిపోయారా..? ఆ మార్పు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
అవునా.. నిజమా..!
2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో సీట్లు వస్తాయని.. ప్రజలకు చాలానే చేశామని చెప్పుకుని ఎన్నికలకు వెళ్లిన వైసీపీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇందుకు మొట్టమొదటి కారణం 10 కాదు 20 కాదు సుమారు 80కి పైగా నియోజవర్గాల్లో అభ్యర్థులను మార్చడమే అని తెలిసొచ్చింది అంట. ఇప్పటికైనా పోయిందేమీ లేదు మారాలని భావించిన జగన్.. అన్నీ సెట్ రైట్ చేస్తూ వస్తున్నారు. అదెలాగంటే.. జిల్లాలకు అధ్యక్షులు, నియోజక వర్గాలకు ఇంచార్జీలను నియమించడంతో ఇప్పుడిప్పుడే పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్టు ఉందనే మాటలు సీనియర్లు చెబుతున్న మాట.
పూర్తి సమయం..!
వాస్తవానికి అధినేతను కలవాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొదలుకుని మంత్రులు వరకూ నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొన్ని కోటరీలను దాటుకొని వెళ్ళడం అంటే అది అయ్యే పని కానే కాదు. ఆఖరికి ఏ సజ్జల రామకృష్ణా రెడ్డి లేదా ధనుంజయ రెడ్డిని కలిసి తిరిగి రావాల్సి వచ్చేది. దీంతో పార్టీకి పెద్ద నష్టమే జరిగింది. సమస్యలు చెప్పుకోవడానికి మీడియం అనేది లేకపోవడంతో పార్టీ ఘోర ఓటమికి ఇది రెండో కారణం అని జగన్ రెడ్డికి తెలిసొచ్చిందట. అందుకే.. ఇప్పుడు నేరుగా జిల్లాల వారీగా ఉన్న నేతలు, అభ్యర్థులను పిలిపించుకుని మరీ మాట్లాడటం, అందరినీ సమన్వయం చేసి.. అధ్యక్షులు, ఇంచార్జీలను నియమించడం జరుగుతోంది.
ప్లాన్ ఏంటి..?
ఎన్నికలు అయ్యి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడే జగన్ వరుసగా సమావేశాలు, నియామకాలు మొదలు పెట్టారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2026 లేదా అంతకు ముందే జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందన్నది ఒక టాక్. అందుకే.. ఇలా వ్యూహరచనలో జగన్ ఉన్నారన్నది కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు.. ఫైర్ ఉండాల్సిందే.. దేశంలోనే వైసీపీ బలమైన పార్టీ కావాలని.. మనల్ని ప్రేమించే, అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కీలక సూచనలు, సలహాలు చేశారు. మొత్తానికి చూస్తే.. జగన్ రెడ్డిలో మార్పు వచ్చింది.. దీంతో మార్పులు, చేర్పులు చేస్తూ రాబోయే ఎన్నికలకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది. మార్పు మంచిదే మరి.. ఇది ఎప్పటి వరకూ, ఎన్ని రోజులు అనేది చూడాలి మరి.