అవును.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు..! టీడీపీలోని ఎమ్మెల్యేలు అంతా ఒక ఎత్తయితే.. ఈయన ఒక్కడు ఒక రీతి..! దీంతో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఓ వైపు.. ప్రత్యర్థులను ప్రతి రోజూ ఢీ కొనడం మరోవైపు.. మధ్యలో వివాదాలను పరిష్కరిస్తూ సీఎం చంద్రబాబు ముందుకెళ్తుంటే ఇదిగో.. కొలికపూడి ఒకరు. ప్రతిరోజూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ తెలుగుదేశం పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి వస్తుండటం గమనార్హం.
ప్రతిసారీ రచ్చేనా..?
కొలికపూడి వ్యవహారం తొలి రోజుల నుంచీ వివాదమే..! పేరుకే మేధావి అని చెప్పుకుంటారు కానీ.. ఇదిగో ఇలా ప్రజాప్రతినిధిగా రచ్చకెక్కడం ఎంత వరకూ సమంజసమో చెప్పండి అని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్న పరిస్థితి. గెలిచాక రోడ్లు గురుంచి.. ఆ తర్వాత ప్రత్యర్థికి సంబంధించిన ఇల్లు కూల్చివేత, ఆ తర్వాత డ్వాక్రా మహిళలతో పంచాయతీ.. పేకాట శిబిరాలు ఏర్పాటులో వాటాలు, చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు ఏకంగా లైంగిక ఆరోపణలు.. చూడండి ఒక్క ఎమ్మెల్యేపై.. అదీ తొలిసారి గెలిచిన వ్యక్తిపై ఇన్ని ఆరోపణలా..? అని సామాన్యుడి నుంచి సీఎం దాకా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.
వద్దే వద్దు..!
తిరువూరు కూటమి ఎమ్మెల్యే కొలికపూడి మాకొద్దంటూ నియోజకవర్గ మహిళలు ఆందోళనకు దిగారు. శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యవహారం ఏంటో నిగ్గు తేల్చేందుకు స్వయంగా కొలికపూడి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. నిరవధిక దీక్షకు పూనుకున్నారు ఎమ్మెల్యే. తనపై చేసిన ఆరోపణలు నిరూపించే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన శపథం చేసి కూర్చున్నారు. అంతేకాదు.. నాపై వచ్చిన లైంగిక ఆరోపణల మీద ఆధారాలుంటే పోలీసులకు చూపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని తనకు తానే డిమాండ్ చేసుకున్నారు.
మరో కోణం బయటికి..!
ఇవన్నీ ఒక ఎత్తయితే. అమరావతి ఉద్యమనేత, మేధావిగా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న కొలికపూడిని పిలిచి మరీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అలాంటిది ఎలా గౌరవం, మర్యాద కాపాడుకోవాలి.. ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ పక్కనెట్టి ఓటువేసి గెలిపించిన తిరువూరు ఓటర్లకు గెలిచాక ఇలా తనలోని మరోకోణం చూపించడం ఎంత వరకు సబబు..? సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన మహిళలను లైంగికంగా వేధించడం ఎంత వరకు సమంజసం..? ఇవన్నీ కాదు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న చంద్రబాబుకు తలనొప్పిగా మారడం పద్ధతేనా..? పోనీ ఇప్పటి వరకూ అదెనబ్బా గెలిచి ఇన్ని రోజులు అయినా నియోజకవర్గంలో చేసింది ఏమైనా ఉందా అంటే అదీ శూన్యమే అని ప్రజలే చెబుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
సస్పెండ్ తప్పదా..?
ఈ గొడవలు అన్నీ ఒక ఎత్తయితే.. మీడియా మిత్రులను నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం, వార్నింగ్ ఇవ్వడంతో ఈయన చరిత్ర అంతా తవ్వి తీసే పనుల్లో మీడియా పడింది. దీంతో కొలికపూడి వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోందట. అందుకే.. కొలికపూడిపై ఉన్న వివాదాలు, వస్తున్న ఆరోపణలు ఎంత వరకూ నిజం..? అని ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేయగా.. అవును అంతా అక్షరాలా నిజమే అని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ రావడంతో ఎమ్మెల్యేపై.. సీఎం తీవ్ర అసంతృప్తి, అంతకు మించి ఆగ్రహంతో ఉన్నారట. అందుకే ఏ క్షణం ఐనా కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ నుంచి సస్పెండ్ అనే బ్రేకింగ్ న్యూస్ రావొచ్చని సీఎంవో నుంచి విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో.. ఈ వ్యవహారానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో..? చూడాలి మరి.
మరో రఘురామేనా..?
ఒకవేళ టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తే మాత్రం కొలకపూడి మరో రఘురామలా తయారయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. నాడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ గా మారిన రఘురామ కృష్ణంరాజు నానా తిప్పలు పెట్టారు. ఆఖరికి నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డిపై కేసులు, కోర్టులు అంటూ చుక్కలు చూపించిన పరిస్థితి మనందరం చూశాం కదా. ఇప్పుడు కొలకపూడిని సస్పెండ్ చేస్తే మాత్రం ఇదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, విమర్శకులు సైతం చెబుతున్న మాటలు. చివరకి కొలకపూడి ఎపిసోడ్ ఎక్కడికి వెళ్తుందో.. చంద్రబాబు ఏం చేయబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.