తెలంగాణలో ఇప్పుడే ఎందుకీ ఈడీ సోదాలు?
తెలంగాణలో చాలా కాలం తర్వాత ఈడీ సోదాలు పెను సంచలనమే సృష్టించాయి. అందులోనూ కాంగ్రెస్ బిగ్ షాట్, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై సోదాలు జరగడంతో ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఉలిక్కిపడ్డారు. మొత్తం.. రూ. 650 కోట్ల టీడీఎస్ స్కాంలో ఈడీ దాడులు జరిగాయని బయట టాక్ నడుస్తున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మాత్రం వేరేలా చర్చ జరుగుతోంది.
ఏం జరిగింది..?
మూడు బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ విషయంలో పొంగులేటి ఫ్యామిలీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితం ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పొంగులేటి కుటుంబ సభ్యుల నివాసాలలో, ఫాం హౌస్ వద్ద ఈడీ సోదాలు నిర్వహించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే CRPF బలగాల బందోబస్తు మధ్య ఈడీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీ నుండి వచ్చిన బృందాలు ఏకంగా 16 చోట్ల సోదాలు చేయడం కీలక ఫైల్స్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడివరకూ అంతా ఓకే కానీ బయట మాత్రం వేరేలా టాక్ నడుస్తోంది.
ఇందులో నిజమెంత..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి రూ. 650 కోట్లు పొంగులేటి సమకూర్చారట. సరిగ్గా ఈ సమయంలోనే ఈడీ సోదాలు జరగడంతో ఇదొక సంచలనంగా మారింది. కర్ణాటక తరహాలోనే ఇక్కడి నుంచి నిధుల తరలించాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసిన పరిస్థితుల్లో ఇలా ఈడీ వచ్చి ఇంటి ముందు వాలిపోవడంతో మంత్రి నోట మాట రాలేదట. ఐతే.. అప్పటికే కొన్ని కీలక ఫైల్స్, భారీగా నగదు తన మనుషులతో ఓ రహస్య ప్రాంతానికి చేరవేసినట్టు సమాచారం.
ఎందుకీ డబ్బులు..?
ఈ కోట్ల డబ్బులు అంతా.. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు పంపుతున్నట్టు సమాచారం. హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బులు తరలించినట్టు ఈడీ అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ నగరంలోని కొన్ని బ్యాంకులకు నిధులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడి నుంచి రూ.650 కోట్లు సమకూర్చి పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఈడీ సోదాలు అని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతో ఈడీ, పొంగులేటికే తెలియాలి మరి.