యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత నటించిన మూవీ, ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా చేసిన మూవీ దేవర. భారీ అంచనాలు నడుమ నేడు థియేటర్స్ లోకి వచ్చిన దేవర చిత్ర మిడ్ నైట్ షోస్, ప్రీమియర్స్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా హడావిడి చేసారు. ఈరోజు తెల్లవారు ఝాము నుంచే దేవర బెన్ ఫిట్ షోస్ పడడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తూ క్రాకర్స్ కాల్చి పండగ చేసుకున్నారు
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ లో తెల్లవారు ఝాము షోస్ కి పర్మిషన్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. అయితే కడప జిల్లా లోని అప్సర థియేటర్ లో ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ సినిమా చూస్తూ కేకలు, విజిల్స్ వేస్తూ రచ్చ చేస్తున్న సందర్భంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దానితో మిగతా ప్రేక్షకులు మస్తాన్ ను దగ్గర లో ఉన్న ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయాడని చెప్పడంతో అక్కడ విషాదకర వాతావరణం చోటు చేసుకుంది.
మరోపక్క అదే కడప లో బస్టాండ్ దగ్గర ఉన్న రాజా థియేటర్ లో మిడ్ నైట్ షో సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు థియేటర్ యాజమాన్యానికి మద్యన గొడవ జరిగింది. చాలామంది టికెట్ లేకుండా థియేటర్ లోకి వెళ్లడంతో థియేటర్ మొత్తం ఫుల్ అయ్యింది. అయితే టికెట్ లేని వారిని అదుపు చెయ్యకుండా వదిలేసిన థియేటర్ సిబ్బందిపై మిగతా యువకులు దాడి చెయ్యడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది.
గొడవ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎంటర్ అయ్యి టికెట్ లేని ప్రేక్షకులను బయటికి పంపేసారు. ఆ గొడవలో కొంతమంది యువకులకు గాయాలవడం హాట్ టాపిక్ అయ్యింది. మరి అభిమానులకు హీరోలంటే పిచ్చి ఉండొచ్చు కానీ.. మరీ ఇంత వెర్రి ఉండకూడదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.