వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించగా.. ఆమోదించడం కూడా గంటల్లోనే ఐపోయింది. ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్టు బులెటిన్ కూడా విడుదలైంది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై బీజేపీ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
ఏరికోరి తెచ్చుకుంటే..!
తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు ఏరికోరి మరీ రాజ్యసభ ఎంపీని చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పట్లోనే ఈ నియామకంపై తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీసీ సామజిక వర్గం తనతోనే ఉందని.. పెద్దపీట వేస్తున్నట్టు అనిపించుకోవడానికి కృష్ణయ్యకు పెద్ద పీట వేసిన జగన్.. ఆఖరికి ఇలా జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఇటు రాష్ట్రంలో.. అటు ఢిల్లీలో వైసీపీకి ఎలాంటి బలం లేదు ఖాళీ అవుతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేయగా.. ఇప్పుడు కృష్ణయ్య రాజీనామాతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.
టార్గెట్ బీసీ..!
రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. 100 బీసీ కుల సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతంచేసేందుకే రాజీనామా చేసినట్టు కృష్ణయ్య వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రానున్న ఎన్నికలకు సిద్ధం అవుతున్న బీజేపీ.. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో.. బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత కృష్ణయ్యను పార్టీలోకి చేర్చుకుంటే బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఓ కేంద్రమంత్రి ద్వారా బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.