ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ని అభిమానించే అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర పై అభిమానుల్లో ఎంతగా అంచనాలున్నాయో కొలమానంలో కొలవడం కూడా కష్టమే. అయితే దేవర ప్రమోషన్స్ విషయంలో తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో క్యూరియాసిటీగా ఉన్నారు.
ఈరోజు హైదరాబాద్ నోవెటల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అని తెలియగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. అసలే తెలుగు రాష్ట్రాల్లో దేవర పబ్లిక్ ఈవెంట్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓపెన్ గ్రౌండ్ లో దేవర ఈవెంట్ ని ప్లాన్ చెయ్యకుండా వర్షాలకు భయపడిన మేకర్స్ నోవెటల్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తే అక్కడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు.
నోవెటల్ పరిసర ప్రాంతమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో జనసంద్రమైంది. తమ హీరోను చూసేందుకు ఫ్యాన్స్ కోకోల్లలుగా తరలివచ్చారు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చెయ్యలేక పోలీసులు చేతులెత్తెయ్యడం మాత్రమే కాదు.. నోవెటల్ సిబ్బంది దణ్ణం పెట్టి ఇక్కడ దేవర ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మరోపక్క ఈవెంట్ మేనేజర్ ఓ 30 నిమిషాల్లో అంతా సెటిల్ చేస్తాం, దేవర ఈవెంట్ జరుగుతుంది అని చెప్పడంతో అక్కడంతా గందరగోళం ఏర్పడింది.
మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తక్కువ అంచనా వేసి ఇలాంటి ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు.