జగన్ లేఖ.. లడ్డుపై లెక్క తేలేనా!
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ఏడుకొండల తిరుమల వెంకన్న పవిత్రత, శ్రీవారి ప్రసాదంపై చెలరేగిన వివాదం యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ మీడియా సైతం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనికి తోడు.. టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డు వివాదంలో నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 8 పేజీల లేఖ రాశారు.
నిజానిజాలు తేల్చండి?
దేశవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని.. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు చేస్తున్న విషప్రచారాల మీద సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలను బయటపెట్టాలని ప్రధానికి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. పథకం ప్రకారం టీటీడీ ప్రతిష్ఠ దెబ్బ తీసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని.. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ లేఖ రూపంలో డిమాండ్ చేశారు. ఈ 8 పేజీల లేఖలో అనేక అంశాలను సుదీర్ఘంగా ప్రస్తావించి వివరంగా రాసుకొచ్చారు.
పూస గుచ్చినట్టుగా..!
వైసీపీ హయాంలో తిరుమల వెంకన్న కోసం సర్కార్ ఏమేం చేసింది అనే విషయాలను సైతం వివరంగా రాసుకొచ్చారు. 100 రోజుల్లోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకొచ్చారని జగన్ లేఖలో వివరంగా రాశారు. ల్యాబ్ రిపోర్టులోని అంశాలు, 2014-19 మధ్యకాలంలో 15 సార్లు, తమ ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024లో 18 సార్లు అలా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించిన విషయాన్ని కూడా లేఖలో పూసగుచ్చినట్టు రాశారు జగన్. ఈ కీలక పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా మీ వైపే చూస్తోందని, చంద్రబాబు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని దేశ ప్రజలు కోరుకుంటోన్నారని మోదీని జగన్ కోరారు.
సమాధానం ఏం వస్తుందో..?
జగన్ లేఖ రాశారు సరే.. ఈ ఎనిమిది పేజీల లేఖ చూసిన తర్వాత మోదీ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది..? రియాక్షన్ వస్తే ఎలా ఉంటుంది..? అనే దానిపై ఇటు వైసీపీ.. అటు టీడీపీ కూటమి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇవన్నీ కాదు కోట్లాది హిందువుల విషయం కాబట్టి అదేదో సీబీఐ విచారణకు ఆదేశించి లెక్క తేలుస్తారా..? అనేది చూడాలి. ఇప్పటికే హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా త్వరలోనే లేఖ రాయడానికి కూడా జగన్ సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోదీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి మరి.