వైసీపీకి రానున్నవి అన్నీ గడ్డు రోజులుగానే కనిపిస్తున్నాయి..! ఎందుకంటే 2019 ఎన్నికల్లో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించని విధంగా 151 సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఇందులో సగం కూడా 2024 ఎన్నికల్లో దక్కించుకోలేక పోయింది. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లి 151 నంబరులో మధ్యలోని 5 కోల్పోయి 11 సీట్లు దక్కించుకుని.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి. దీంతో అసలు వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా ఉందని ఆ పార్టీ నేతలు అనుకుంటారేమో కానీ ఒక్కొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు.
ఎవరా కీలక నేత!
ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, అధినేతకు అత్యంత ఆప్తులు పార్టీని వీడి జనసేన.. టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు మరికొందరు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. టీడీపీ సంగతి అటుంచితే వైసీపీ నుంచి జనసేనలో చేరికకు నేతలు ఎక్కవ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే.. రానున్న రోజులు అన్నీ ఆ పార్టీకే అని గట్టిగా జనాలు నమ్ముతున్నారని అందుకే నేతలు అందరూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిపోతున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత, వైఎస్ జగన్ అత్యంత సన్నిహితులు దాడిశెట్టి రాజా పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయి.
చిరుతో భేటీ.. త్వరలో చేరిక!
ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య , టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో దాడిశెట్టి భేటీ అయ్యారని తెలిసింది. అనంతరం పార్టీలో చేరికపై కీలక నేత కొణిదెల నాగబాబుతో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకటి రెండు రోజుల్లో వైసీపీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే దాడిశెట్టి చిరు ద్వారా జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న మాట. రాజకీయాలకు, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఇక్కడ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నారు అన్న మాట. త్వరలోనే సేనానితో భేటీ అయ్యి.. చేరికకు దాడిశెట్టి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారని సమాచారం. వైసీపీకి ఇంకా ఎంత మంది గుడ్ బై చెబుతారో.. ఎంత మంది పార్టీలోనే ఉంటారో చూడాలి మరి.