100 రోజుల ఎన్డీఏ పాలన.. వెయ్యి అడుగులు!
ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న టీడీపీ కూటమి వంద రోజులు పూర్తి చేసుకుంది. జూన్ 12న సీఎంగా నారా చద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. సెప్టెంబర్ 20నాటికి 100 రోజుల పాలన పూర్తయ్యింది. రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి.. వెయ్యి అడుగులు ముందుకేసింది అని స్వయంగా చంద్రబాబే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు.. ఇందుకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
100 రోజుల్లో చేసిందేంటి..?
ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి ప్రతినెలా 1నే ఇళ్లవద్ద రూ.4వేలు ఇవ్వడం కూటమి అధికారంలోకి వచ్చాకే సాధ్యం అయ్యింది. మెగా డీఎస్సీకి చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా 100పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ ఇచ్చింది సర్కార్. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు, రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు..
పోలవరం నిర్మాణానికి రూ.12,500కోట్లు కేంద్రం అనుమతి కేవలం 100 రోజుల్లోనే పొందినది. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి సెప్టెంబర్ 19నుంచి ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చింది. విషపూరిత మద్యంస్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది. నాణ్యమైన మందు కేవలం 99 రూపాయలకే అందజేయనుంది. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు.. స్కాన్ చేస్తే భూమి సరిహద్దులు, లొకేషన్ వచ్చేలా క్యూ ఆర్ కోడ్‌తో పాస్ పుస్తకాలు.. దీంతో పాటు భూముల రీ సర్వే నిలిపివేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 100 రోజుల్లో చాలానే చేసింది సర్కార్.
టార్గెట్ ఏంటి..?
గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం అని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా 2047కు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలన్నారు. రెండేళ్లలో పోలవరం ఫేజ్ -1 పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చేపడుతున్నట్టు.. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఏపీలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం మాటిచ్చారు. దీపావళి పండుగ కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని సభా వేదికగా చంద్రబాబు స్పష్టం చేశారు.
గట్టిగా ఇవ్వండి..!
వైసీపీ అనునిత్యం విషం కక్కే పనిలో ఉందని.. ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా తిప్పికొట్టాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని .. అంతే కాకుండా త్వరలోనే జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను కూడా నియమిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తమీద ఈ వంద రోజుల్లో చేసినదేంటి..? ఇంకా ఏం చేయబోతున్నాం అనేది మాత్రం ఇంటింటికీ వెళ్లి ప్రజాప్రతినిధులు చెప్పి తీరాల్సిందే అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం అనే విధంగా కార్యాచరణే కూటమి సర్కార్ ధ్యేయం!. ఇక విమర్శలు అంటారా..? ప్రభుత్వంపై లేని పోని విమర్శలు, లెక్కలేనన్ని ఆరోపణలు సర్వ సాధారణమే.