అయ్యా.. బాలినేని ఇకనైనా అలగొద్దు!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఇన్నాళ్లు ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎప్పటినుంచో ఈయన జంప్ అవుతున్నారన్న వార్తలకు సెప్టెంబర్-18తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు జనసేన తీర్థం పుచ్చుకుంటారని కూడా స్వయంగా ఆయనే చెప్పేసారు కూడా. వైసీపీకి రాజీనామా సరే.. జనసేనలో చేరిక సరే ఈ సందర్భంగా బాలినేని కొన్ని నేర్చుకోవడం, మరికొన్ని అలవాటు చేసుకుంటే చాలా మంచిది..!
ఇకనైనా మారండి మహాప్రభో!
వాస్తవానికి బాలినేని అంటే తోపు, తురుము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కానీ.. ఆయన వైసీపీలో ఉండగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సొంత పార్టీ నేతలు, అనుచరులకే రుచించని పనులు ఆయన చాలానే చేశారన్నది అందరికీ తెలిసిందే. ఎలాగంటే.. ఏడాదిలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 సార్లు అధిష్ఠానం, అధినేత వైఎస్ జగన్ రెడ్డిపై అలిగారు అంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే వైసీపీలో ఉన్నన్ని రోజులు ఆయన్ను బాలినేని అనే వారి కంటే అలిగేనేని అనే ఎక్కువగా పిలిస్తుండేవారు. వైసీపీలో ఉన్నన్ని రోజులు ఎలాగో ఈ విషయంలో మార్పు ఎలాగో రాలేదు.. ఎందుకు పార్టీ మారాల్సి వస్తోంది అనేది కూడా తెలియదు గనుక తమరు చేరే జనసేన పార్టీలో అయినా మంచిగా, మర్యాదగా.. అలక అస్సలు లేకుండా అంటే అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పదివేలు..!
చాలానే ఉన్నాయ్..!
పార్టీ, పార్టీ నేతల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ చాలా సున్నితంగా ఉంటారన్నది తెలిసిందే. అలాంటిది అల్లుడు జగన్.. మామ బాలినేనిని భరించలేని పరిస్థితుల్లో వెళ్ళిపొండి అంటూ వదిలేశారు అంటే ఎంత విసుగు చెందారో అని వైసీపీ శ్రేణులు ఆలోచనలో పడిన పరిస్థితి. అలాంటిది పవన్ పార్టీలో తప్పకుండా ఒళ్ళు దగ్గరబెట్టుకొని ఉంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు సైతం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బాలినేని ఆల్ ది బెస్ట్.. బాలినేని తీసేసి అలిగేనేని అని పెట్టుకోండి.. ఏ పార్టీలోకి వెళ్ళినా ఏడాదికి 12 సార్లు అలుగుతా మీరు నన్ను తప్పకుండా బుజ్జగించాలనే షరతు విధించి వెళ్ళండి.. అంతే కాదు దయచేసి మళ్ళీ తిరిగి వైసీపీలోకి రాకండి అంటూ దండం పెట్టి మరీ వేడుకుంటున్నారు కొందరు వీరాభిమానులు, అనుచరులు. మరోవైపు.. జగన్ పనికట్టుకుని మరీ మామను పవన్ పార్టీలో కోవర్టుగా చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. Any Way.. All The Very Best బాలినేని.. జనసేనలో ఐనా జర జాగ్రత్తగా అంతకు మించి మర్యాద కాపాడుకోండి మరి.