Advertisement
Google Ads BL

జమిలీకి గ్రీన్ సిగ్నల్.. కూటమిలో గుబులు!


అవును.. జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రామ్ నాథ్‌ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో జమిలీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో లేదా.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానున్నది. అంతా ఓకే కానీ ఏపీలోని కూటమి ప్రభుత్వం మున్నాళ్ళు ముచ్చటగా ముగుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది కేంద్రం భావన.

Advertisement
CJ Advs

ఎందుకిలా..?

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ పై దేశవ్యాప్తంగా గట్టిగానే భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరిగితే మోదీ ప్రభావం ఆయా రాష్ట్రాల మీద పడి బీజేపీకి లబ్ది కలుగుతుందని, లేకుంటే అసెంబ్లీలలో ప్రాంతీయ పార్టీలకు ఇతర పార్టీలకు జనాలు మొగ్గు చూపుతారని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దెబ్బతో ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసే వ్యూహం కూడా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణే కర్ణాటక, తెలంగాణలో జరిగిన ఎన్నికలే. ఈ రెండు చోట్ల ఎంపీ స్థానాలు ఊహించిన దానికంటే ఎక్కువగా దక్కించుకున్న బీజేపీ.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయింది.

ఓహో.. ఇదా ప్లాన్!

వాస్తవానికి జమిలీ ఎన్నికలు అనే ప్రపోజల్ ఇప్పటిది కాదు గత కొన్నేళ్లుగా నడుస్తున్నదే. 2019 ఎన్నికల సమయంలోనే భగీరథ ప్రయత్నం చేయగా.. అది కాస్త అమలులోకి రావడానికి ఇప్పుడు (2024) సమయం ఆసన్నం అయ్యింది అంతే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఒక అభద్రతా భావంతో పాలన సాగిస్తున్న పరిస్థితి అట. ఎందుకంటే మిత్రులుగా ఉన్న టీడీపీ, జేడీయూ ఎప్పుడు శత్రువులుగా మారి వ్యతిరేకం అవుతారో తెలియని పరిస్థితి. దీంతో ఐదేళ్లు ప్రభుత్వాన్ని నెట్టుకొని రావడం అంటే పెద్ద గగనమే. ఇన్ని తిప్పలు పడే బదులు జమిలీకి వెళ్ళడం బెటర్ అని కేంద్రంలోని అగ్రనేతలు స్పీడప్ చేశారట. ఇదో మోదీ, అమిత్ షాల మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్నికలు ఎప్పుడు..?

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2026 దాకా వరసబెట్టి జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. 2025 చివరిలో బీహార్ రాష్ట్రంతో మరికొన్ని చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇక దేశ రాజకీయాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్.. తమిళనాడు రాష్ట్రాల్లో 2026లో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే జమిలీకి మోదీ సర్కార్ ముహూర్తం ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇంతలోనే బాంబ్..!

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది అంతే. సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ చేసుకుంటూ టీడీపీ కూటమి ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం జమిలీ అంటూ బాంబ్ పేల్చింది. ఒకవేళ ఎన్నికలు జరిగితే టీడీపీకి ప్లస్ ఉంది.. అంతకు మించి మైనస్ కూడా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయ్. ఎందుకంటే.. మేం ఐదేళ్ల కోసం పెద్ద ప్రణాళికను రచించాం కానీ కేంద్రం నీరుగార్చింది అని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది. అంతే కాదు ఈ కోపంతో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చినా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదేమో..! ఇక మైనస్ విషయానికి వస్తే సూపర్ సిక్స్ అమలులో అట్టర్ ప్లాప్ అని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయ్. ముఖ్యంగా.. నీకు 15 వేలు, నీకు 15 .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ ఐపోయింది. ఇలా సూపర్ సిక్స్ పై జనాల్లో గట్టిగానే కూటమి వ్యతిరేకత కొని తెచ్చుకుంది. ఈ విషయంలో వైసీపీకి కాస్త ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయ్యే పనేనా..?

అంటే ఇప్పుడు టీడీపీ కూటమికి ఇంచుమించు రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ టైంలో సూపర్ సిక్స్ అమలు చేస్తే సరే లేకుంటే కూటమి సర్డుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు అభివృద్ధి.. ఇంకోవైపు సంక్షేమం రెండూ చేయాల్సి ఉంది. దీంతో కూటమికి ఎక్కడలేని చిక్కులు వచ్చి పడినట్టు అయ్యింది. ఇప్పుడు అమరావతిని ఒక దశకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సంక్షేమం అంటారా.. సూపర్ సిక్స్ అమలు చేస్తే అదే పెద్ద సంక్షేమం అని చెప్పుకోవచ్చు.. కానీ ఇవన్నీ సాధ్యమేనా..? ఎటు చూసినా పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో అని టీడీపీ, జనసేన కూటమిలో గుబులు పుడుతున్న పరిస్థితి. జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో..? మోదీ మనసులో ఏముందో..? చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? వైఎస్ జగన్ దగ్గరున్న ప్లాన్ ఏంటో చూడాలి మరి.

The Union Cabinet approved the One Nation-One Election proposal:

Jamili got a green signal after the Union Cabinet approved the report of the Ram Nath Kovind Committee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs