ఆఫీసర్.. అట్లుంటది మరి.. జగన్ రెడ్డి దెబ్బ!!
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటే ఒకప్పుడు ప్రజల్లో చాలా గౌరవ, మర్యాదలు ఉండేవి..! వారికున్న విశిష్ట అధికారాలతో ఎన్నో అద్భుతాలు సృష్టించి చిరస్థాయిలో నిలిచిపోయిన వారు ఉన్నారు..! ఐతే ఒకరిద్దరు చేస్తున్న చెత్త పనులకు యావత్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి. దీనికి తోడు పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా తప్పక మారాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయ్. ఇందుకు రూల్స్ ఒప్పుకోకపోయినా ఏ పార్టీ అధికారంలో అంటే ఎమ్మెల్యేలు మొదలుకుని మంత్రులు, ముఖ్యమంత్రుల వరకూ చెప్పినట్టు చెప్పినట్టు చేసి తీరాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్నేళ్లుగా ఈ పరిస్థితులను కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఇందుకు చక్కటి ఉదాహరణ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఎందుకు.. ఏమైంది..!?
అదేదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా కత్తి వాడటం మొదలుపెడితే.. అన్నట్టుగా అధికారులను వాడకం మొదలుపెడితే వైఎస్ జగన్ కంటే ఎవ్వరూ వాడలేరు అంతే. ఎలాగంటే.. ఎలాంటి అధికారం లేనప్పుడే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఐఏఎస్ అధికారాలతో చేయకూడని పనులు చేయించి జైళ్లపాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇక ఎవరు ఆ అధికారులు అనేది ప్రత్యేకించి పేర్లు చెప్పాల్సిన అవసరం ఐతే లేదు. అధికారం లేనప్పుడే విర్రవీగిన జగన్.. అధికారంలోకి వస్తే అంత ఆషామాషీగా ఉంటారా..? అస్సలు ఉండరు కదా. అధినేతకు తెలిసే జరిగిందో.. తెలియకుండానే జరిగిందో పక్కన పెడితే.. ఇదంతా జరిగింది మాత్రం జగన్ హయాంలో గనుక ఆయన ఖాతాలోకి వస్తుంది. నాడు ఐఏఎస్‌లు.. నేడు ఐపీఎస్‌లు జగన్ దెబ్బకు నిలువునా బలైపోయారు.
వదలరా... ఎవ్వరినీ!
వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూటమి సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. వీరు ముగ్గురూ సీనియర్ అధికారులే. ఇందులో ఒకరు.. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, మరొకరు విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, ఇంకొకరు విశాల్ గున్ని. ఈ ముగ్గురినీ సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేయడం జరిగింది. ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంతో పాటు ముగ్గురిపై పలు అభియోగాలు రావడంతో సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ తగిన చర్యలు తీసుకుంది. దీంతో వైఎస్ జగన్ ఎవ్వరినీ వదలరా..? ఎందుకిలా చేస్తున్నారు..? పోనీ ఆయన చెప్పినట్టు.. తప్పు అయినా ఎందుకు ఐపీఎస్ అధికారులు చేశారు అని జనాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు.. నేడు..!
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐఏఎస్‌లను బలి చేసారని.. ఇప్పుడు ఏకంగా.. తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఐపీఎస్‌లను బలి చేసారని.. బలి అయిన అధికారులు కక్కలేక, మింగలేక ఉండిపోయిన పరిస్థితి. అంతే.. జగన్ రెడ్డిని నమ్ముకుంటే, తనతో పాటు జైలుకి వెళ్ళాల్సిందే అనేది మరోసారి రుజువు అయ్యిందనే మాటలు ఎక్కడ చూసినా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఐతే నాడు ఐఏఎస్‌లు జగన్ చెప్పినట్టు విని బలి ఐతే.. నేడు మాత్రం జగన్ ప్రమేయం లేకుండానే.. సజ్జల రామకృష్ణారెడ్డి (వైసీపీ హయాంలో సకల శాఖా మంత్రిగా) చెప్పినట్టు చేసి ముగ్గురు ఐపీఎస్ అధికారులు జీవితాన్ని నాశనం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దెబ్బతో.. రేపు పొద్దున్న తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపీకి రావాలంటే ఐఏఎస్, ఐపీఎస్‌లు బయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుందో ఏంటో.. అసలు మార్పు ఆశించడమే తప్పు ఏమో.. ఏదేమైనా జగన్ దెబ్బ ఇట్టానే ఉంటుంది మరి.. ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిది సుమీ..!