సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా.. ఢిల్లీని ఏలేది ఎవరు..!?
దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతోంది..! భారతదేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పేసారు. ఈ సంచలన ప్రకటనతో యావత్ దేశం మొత్తం ఢిల్లీ వైపే చూస్తోంది. దీంతో తదుపరి సీఎం ఎవరు..? మళ్ళీ ఎన్నికలకు వెళతారా..? లేదా..? హస్తినలో ఏం జరగబోతోంది..? అని కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం ఎదురుచూపుల్లో ఉంది. ఎందుకంటే.. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం చేసైనా సరే అధికారంలోకి వస్తున్న బీజేపీ.. ఢిల్లీలో పాగా వేయడానికి అస్సలు కావట్లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామాతో బీజేపీ అగ్రనేతలు ఏం చేయబోతున్నారు అనేది అంతు చిక్కడం లేదు.
ఎందుకు.. ఏమైంది..?
ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా పెను తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి.. బెయిల్ పైన బయటికి వచ్చారు. ఐతే.. ఈ కేసులో దోషిగా అంటూ సీఎం పదవిలో ఉండటానికి అర్వింద్ ఇష్టపడటంలేదు. అందుకే.. తాను నిర్దోషిగా బయటపడే వరకూ సీఎం పదవిలో ఉండనని.. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో స్వయంగా కేజ్రీవాల్ చేసిన ఈ సంచలన ప్రకటనతో కార్యకర్తలు కంగుతిన్నారు. ఇప్పుడీ ప్రకటనతో ఆప్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు.
తదుపరి సీఎం ఎవరు..?
ఇదిలా ఉంటే.. తదుపరి సీఎం ఎవరు అనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. పనిలో పనిగా సీఎం కొన్ని లీకులు కూడా ఇచ్చారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. కొత్త సీఎం ఎంపిక కోసం రెండు మూడ్రోజుల్లో పార్టీ సమావేశం ఉంటుందన్నారు. మొత్తానికి చూస్తే.. నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విశ్వసనీయ వర్గాలు, ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషీ మార్లేనా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆప్ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఆతిషీని ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
ఏమవుతుందో..?
ఆప్.. పార్టీ స్థాపించిన ఏడాది వ్యవధిలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన పార్టీ. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు, అంతకు మించి అగ్ని పరీక్షలు ఎదుర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో తొలి నుంచి ఇప్పటి వరకూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక కేసులు, అరెస్టులు ఆప్ పార్టీకి బోనస్ అని చెప్పుకోవచ్చు. ఆఖరికి ఢిల్లీ లిక్కర్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆ తర్వాత సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎన్నిసార్లు చుక్కెదురు అయ్యిందో అందరికి తెలిసిందే. ఆఖరికి షరతులతో కూడిన బెయిల్ సిసోడియా, కేజ్రీవాల్ కు సుప్రీం ఇవ్వడంతో కాస్త ఊరట లభించింది. ఐతే .. నవంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేజ్రీవాల్ తనదైన రాజకీయ చాణక్యత, వ్యూహ రచనకు తెరదీశారు. ఇలా రాజీనామాలు, ఎన్నికలకు వెళ్ళడం కూడా ఆప్ పార్టీకి కొత్తేమీ కాదు. ఐతే.. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి మరి.