నోరు తెరిస్తే చాలు.. ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు..! ఇంకో అడుగు ముందుకేసి.. ఆంధ్రా వాడివి, బతకడానికి వచ్చినోడివి..! ఇవీ గత 48 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న, కనిపిస్తున్నవి. అసలు ఇలాంటి మాటలు తెలంగాణకు చెందిన ఒక ప్రజాప్రతినిధి నుంచి రావొచ్చా..! అదీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఊహించగలమా.. అస్సలు కానే కాదు కదా..! ఏదైతే జరగొద్దు అని అనుకుంటే అదే అక్షరాలా జరిగిపోతున్న పరిస్థితి..! యంగ్ ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి.. ఫ్యూచర్ చాలా ఉంటుంది కాబట్టి ఏం చేసినా ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. చేసే ప్రతీ పనిలో ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి కానీ కౌశిక్ రెడ్డికి ఏమైందో తెలియట్లేదు కానీ బుర్రలో గుజ్జు పోయి మొత్తం బురద పేరుకుపోయినట్టు ఉందనే విమర్శలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి..!
సారూ.. జర సూడుర్రి!
హైదరాబాద్.. దేశంలో ఒక పెద్ద మహానగరం..! ఇప్పుడు దేదీప్య మానంగా వెలుగొందుతోందంటే ఇందులో ఆంధ్రుల పాత్ర చాలా ఉంది. అది ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన రాజకీయ నేతలు.. రాయలసీమ, కోస్తా మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి వచ్చిన జనాల పాత్ర అయినా కావొచ్చు..! ఈ విషయం తెలంగాణ పెద్దలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బాగా తెలుసు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరికి మాత్రం ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతోమంది ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వారిలో ఎంతో మంది రాజకీయ నేతలుగా ఎదిగారు. సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎదిగారు. ఇందులో ఒకరు.. మాజీ బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పదేళ్ళ పాటు అధికారంలో ఉండటానికి కారణం కూడా సెటిలర్స్ ఓట్లు, ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ విషయం మరిచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకూ సబబు..? కేసీఆర్ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇలాంటి వాళ్ళను అదుపులో పెడితే చాలా మంచిదన్నది సగటు కార్యకర్త అభిప్రాయం.
ఏమైనా పద్దతేనా..?
గొడవ పడింది ఎవరు.. ఒకరు మాజీ, ఇంకొకరు ప్రజెంట్ ఎమ్మెల్యే.. వీళ్లూ వీళ్లూ రాజకీయ గొడవలు పడి ప్రాంతీయ విషం చిమ్మడం ఏంటో..? ఎవరికీ అర్థం కాని విషయం. ఐనా గత పదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా కేసీఆర్ ఆంధ్ర వాళ్ళను పొల్లెత్తి మాట కూడా అనలేదు.. ఇంకా చెప్పాలంటే కంటికి రెప్పలాగా చూసుకున్నారు. అలాంటిది ఇప్పుడు అధికారం పోయేసరికి ఇలా మాట్లాడటం ఏంటి..? ఇది ఏమైనా పద్ధతేనా..? ఇంతలా ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అని రెచ్చగొట్టే మాటలు వస్తున్నా గులాబీ బాస్ కేసీఆర్ అండ్ కో ఎందుకు మౌన వ్రతం పాటిస్తున్నారో సగటు కార్యకర్తకు అర్థం కావట్లేదు. కౌశిక్ లాంటి వ్యక్తుల వల్ల పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం ఉందో తెలియదు కానీ.. నష్టం మాత్రం గట్టిగానే ఉందని చెప్పొచ్చు. అధినేతకు ఆంధ్రోళ్లు అవసరమా.. లేదా అనేది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.. కనీసం ఒక్క స్టేట్మెంట్ ఐనా ఇస్తే బాగుంటుంది ఏమో..!
గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయ్ జాగ్రత్త..!
అసలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్. అలాంటప్పుడు ఇలా సెటిలర్స్‌ను దూరం చేసుకోవడం ఎంత వరకూ సమంజసం. కౌశిక్ దెబ్బతో ఆంధ్రా ఓటర్లు ఒక్కరైనా కారు గుర్తుకు వేసే పరిస్థితులు ఉన్నాయా..? అంటే ఏ మాత్రం కనిపించడంలేదు. జరిగినదేదో జరిగింది.. నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే అసలుకే ఎసరు వస్తుంది. కేసీఆర్ ఇకనైనా ఫాం హౌస్ నుంచి బయటికి వచ్చి ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్కుంటే మంచిది. ఐనా.. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రా, తెలంగాణ అని గొడవలు ఏంటి..?. ఇవన్నీ కాదు.. కారు పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తరవాత నాడు టీడీపీ నుంచి గెలిచిన వాళ్లకు గులాబి కండువాలు కప్పి టికెట్స్ కూడా ఇచ్చి గెలిచాక మంత్రి పదవులు కూడా ఇచ్చిన విషయం కౌశిక్ తెలుసుకుంటే మంచిది. ఆస్తిత్వం కోసం నాయకులు సృష్టించే ద్వేషమే తప్ప.. అసలీ కులాల, మతాలు.. ప్రాంతాల మధ్య వైరం లేదని సామాన్య ప్రజలు గ్రహించే దాకా ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి.. జనాలు పంతాలు పట్టింపులకు పోకుండా సమయం సందర్భం అదేనబ్బా ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్లకు బుద్ధి చెబితే బాగుంటుంది మరి.